మరోసారి రాజకీయ తెరపైకి కేవీపీ పేరు వచ్చింది. సలహాదారుడంటే కేవీపీనే గుర్తుకొస్తారు. మాట్లాడకుండానే ఆయన పనులు చక్కదిద్దుతారనే పేరుంది. తాను చెప్పదలచుకున్నది నేరుగా తన ఆప్తమిత్రుడు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తప్ప మూడో మనిషితో మరో మాటే ఉండదు.
మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భమే లేదు. అసలు వైఎస్సార్ జీవించినంత కాలం కేవీపీ మీడియాతో మాట్లాడ్డం ఎవరికీ గుర్తు ఉండదు. వైఎస్సార్ పాలన ఒడిదుడుకుల లేకుండా సాగుతున్నదంటే… తెరచాటున కేవీపీ సలహాలే కారణమనే అభిప్రాయాలు లేకపోలేదు. సలహాదారుడిగా కేవీపీ తీరుపై తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఓ కేసు విచారణలో ప్రస్తావించడం గమనార్హం.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా ఉంటూ, ఎస్ఈసీగా నియమితులయ్యారు. దీంతో సహజంగానే సలహాదారుల అంశం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవడం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంత మంది సలహాదారులను నియమించుకునే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకూ లేవని జస్టిస్ దేవానంద్ పేర్కొనడాన్ని బట్టి… సలహాదారులకు ఎలాంటి లగ్జరీ ఏర్పాట్లు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడేవారు కారని, ఇప్పుడు కొందరు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని జస్టిస్ దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు… ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడానికే మీడియా ముందుకు వచ్చారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గుర్తు చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
హైకోర్టు వ్యాఖ్యలపై జనం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఇంత మంది సలహాదారులున్నా… సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. పైగా సలహాదారులే మీడియా ముందుకొచ్చి రాజకీయ, ప్రభుత్వ పాలసీలపై మాట్లాడ్డం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇలాంటి ధోరణలున్నాయి. కుటుంబరావు, పరకాల ప్రభాకర్ తదితరులు మీడియాతో తరచూ మాట్లాడేవాళ్లు.
ఈ నేపథ్యంలో నాడు వైఎస్సార్ హయాంలో కేవీపీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో సలహాదారులను పోల్చుతూ జనం చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సలహాదారులు పార్టీ అధికార ప్రతినిధుల్లా ప్రతిదానికి మీడియా ముందుకొచ్చి మాట్లాడ్డాన్ని గుర్తు చేసు కుంటున్నారు. ఇదే వైఎస్సార్ హయాంలో కేవీపీ మినహా మరెవరూ సలహాదారులున్నట్టు కూడా ఎవరికీ గుర్తు లేదు.
కేవీపీ ఏనాడూ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ, పార్టీ విధానాలపై మాట్లాడే వారు కాదు. అలాంటి అంశాలపై మాట్లాడేందుకు ప్రభుత్వం, పార్టీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అలాంటి ఏర్పాట్లు కొరవడ్డాయని, సలహాదారులకు, ఇతరులకు తేడా లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.