వివేకా మ‌ర్డ‌ర్‌పై … రంగ‌న్న ఏం చెప్పాడో?

రంగ‌న్న ఏం చెప్పి ఉంటాడ‌బ్బా… పులివెందులే కాదు యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా చ‌ర్చించుకుంటున్న విష‌యం. ఇంత‌కూ ఈ రంగ‌న్న ఎవ‌రు? ఆయ‌న చెప్ప‌డం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. వివేకా హ‌త్య కేసులో…

రంగ‌న్న ఏం చెప్పి ఉంటాడ‌బ్బా… పులివెందులే కాదు యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా చ‌ర్చించుకుంటున్న విష‌యం. ఇంత‌కూ ఈ రంగ‌న్న ఎవ‌రు? ఆయ‌న చెప్ప‌డం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. వివేకా హ‌త్య కేసులో రంగ‌న్న కీల‌క సాక్షి. పులి వెందుల‌లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇంటి వ‌ద్ద భ‌డ‌వాండ్ల రంగ‌న్న అలియాస్ రంగ‌య్య (65) కాప‌లాదారుడు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే ఆ ఇంటి కాపలాదారుగా ఉన్నాడు.

వివేకా బతికి ఉండగా చివరిసారి, చనిపోయాక మొదటిసారి చూసింది రంగ‌న్న‌నే. హ‌త్య‌కు గురైన మార్చి 15న‌ ఉదయం వివేకా నిద్రలేచి బయటకు రాకపోయేసరికి పక్క డోరులో నుంచి లోపలికి వెళ్లి ఆయన స్నానపు గదిలో రక్తపుమడుగులో ఉన్నట్లు గుర్తించాడు. ఆ విషయాన్ని లోకానికి చెప్పింది కూడా రంగన్నే. అందుకే రంగ‌న్న ఈ హ‌త్య‌లో కీల‌క సాక్షిగా మారాడు. పైగా వివేకా ఏపీలో చాలా ప్ర‌ముఖుడు.

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు వివేకా స్వ‌యాన బాబాయ్‌. అలాగే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌కు సొంత త‌మ్ముడు. దీంతో వివేకా హ‌త్య ద‌ర్యాప్తు అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. వివేకా హ‌త్య‌పై ప్ర‌చారంలో ప‌లువురు ముఖ్యుల పేర్లు ప్ర‌చా రంలో ఉన్న‌ప్ప‌టికీ, అంతిమంగా సీబీఐ ఎవ‌రిని దోషులుగా తేల్చుతుంద‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కుంది. 

త‌న తండ్రి హ‌త్య కేసులో దోషులు ఎంత‌టి వారైనా శిక్షించాల‌నే ప‌ట్టుద‌ల‌లో వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె న్యాయ పోరాటం చేసి త‌న తండ్రిపై సీబీఐతో ద‌ర్యాప్తు చేయించడంలో మొద‌టి విజ‌యం సాధించారు.

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఇబ్బందులు త‌లెత్తాయి. వివేకా హ‌త్య ద‌ర్యాప్తులో మంద‌గ‌మ‌నంపై డాక్ట‌ర్ సునీత ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మ‌ళ్లీ పుంజుకుంది. ఈ నేప‌థ్యంలో గ‌త 50 రోజులుగా సీబీఐ త‌న విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. ఇందులో భాగంగా ప‌లువురు అనుమానితుల‌ను లోతుగా విచారించింది. ఈ క్ర‌మంలో కీల‌క సాక్షి అయిన రంగ‌న్న వాంగ్మూలాన్ని జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్ నమోదు చేసుకున్నారు. 

శుక్ర‌వారం ఉద‌యం 11.30 నుంచి 12.45 వరకూ వాంగ్మూలాన్ని న‌మోదు చేశారు. ఆ సమయంలో న్యాయమూర్తి, రంగన్న మాత్రమే లోపల ఉన్నారు. ఇతరులను అనుమతించలేదు. రాత్రి 8.30 సమయంలో రంగ‌న్న‌ను పులివెందుల బస్టాండు వద్ద సీబీఐ అధికారులు విడిచిపెట్టారు.  

ఈ సంద‌ర్భంగా రంగ‌న్న స్థానికుల‌తో పాటు మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడాడు. సీబీఐ ఇచ్చిన ధైర్యంతో కొంద‌రి పేర్ల‌ను చెప్పిన‌ట్టు రంగ‌న్న వివ‌రించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఎర్ర‌గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, సునీల్‌కుమార్ పేర్ల‌తో పాటు ముఖ్యంగా ఇద్ద‌రు ముగ్గురు కీల‌క వ్య‌క్తుల పేర్ల‌ను చెప్పిన‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఇందులో నిజా నిజాలేంటో సీబీఐ త‌ప్ప‌, మిగిలిన వారెవ‌రూ నిర్ధారించ‌లేరు. కానీ ఫ‌లానా వాళ్ల పేర్లు రంగ‌న్న చెప్పారంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కానీ అలాంటిదేమీ లేద‌ని సీబీఐ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసు ముగింపు ద‌శ‌కు వ‌చ్చే స‌రికి ఉత్కంఠ పెరిగింది.