cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమా చూపించేస్తున్న జగన్

సినిమా చూపించేస్తున్న జగన్

ఎవరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అన్నట్లుగా వుంది వ్యవహారం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత ఆచి తూచి తీసుకున్న నిర్ణయం సినిమా రంగానికి దిమ్మదిరిగిపోయేలా చేసింది. 

ఒక్క సీఎంగా జగన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల మూడు రాష్ట్రాల్లో థియేటర్ వ్యవస్థ స్థంభించిపోయింది. అమెరికాలో సైతం సినిమా వ్యాపారం పై ప్రభావం చూపింది. 

కరోనా నిబంధనలు సడలించి వారాలు గడుస్తున్నా థియేటర్ తలుపులు తెరుచుకోవడం లేదు. సినిమాలు పూర్తయి రెడీగా వున్నా, థియేటర్ దారి పట్టడం లేదు. పెద్ద హీరో రెడీగా వున్నాడు..నిర్మాత డబ్బులతో రెడీగా వున్నాడు. డైరక్టర్ హుషారుగా వున్నాడు. కానీ కథే కుదిరి చావడం లేదు అన్నట్లుగా వుంది తెలుగు సినిమా పరిస్థితి. 

ఇంకా చిత్రమైన సంగతి ఏమిటంటే, అసలు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో అన్నది తెలియకపోవడం. ఏ సమస్య కైనా పరిష్కారం కావాలంటే రకరకాల మార్గాలు వుంటాయి. ఏదో ఓ మార్గం నుంచి పరిష్కారం కోసం కృషి చేయడం అన్నది జరుగుతుంది. పరిష్కారం లభించడానికి అవకాశం వుంది. కానీ ఈసారి ఈ టికెట్ ల సమస్యను పరిష్కరించడానికి దారి ఏది అన్నది ఒక్క శాతం కూడా తట్టడం లేదు. కేవలం జగన్ మదిలో ఆలోచన పుడితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. అనే అభిప్రాయానికి ఇండస్ట్రీ వచ్చేసింది. ఆ ఆలోచన ఎలా పుట్టించాలో అన్నది కూడా తెలియని పరిస్థితి.

ఏ మంత్రిని కదిలిస్తే పని జరుగుతుంది. ఏ మంత్రిని అడిగితే ముఖ్యమంత్రిని సానుకూలం చేస్తారు? ఏ మంత్రి ద్వారా ఈ వ్యవహారం జరిపించవచ్చు అన్నది కూడా తట్టడం లేదు. ఇది ఒక చిత్రమైన పరిస్థితి.  సినిమా థియేటర్ టికెట్ రేట్లు ఫిక్స్ చేయడం వల్ల టోటల్ థియేటర్ వ్యవస్థ స్థంభించిపోయింది. 

కేవలం జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ఠాల్లో సినిమా థియేటర్ల వ్యవస్థ సంక్షోభంలో పడింది. అమెరికాలో సైతం మన సినిమాలు ప్రదర్శన నిలిచిపోయింది. దీని వల్ల వందల కోట్ల టర్నోవర్ ఆగిపోయింది. వందలాది మధ్య ఉద్యోగుల జీవితాలు సంక్షోభంలో పడిపోయాయి. కేవలం తీసుకోవాల్సిన నిర్ణయం త్వరగా తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి. 

నిజానికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఎగ్జిబిటర్లు పెద్దగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. జగన్ నిర్ణయించిన రేట్లకు అతి కొద్దిగా సవరించమని కోరుతున్నారు తప్ప భారీగా సవరించమని అడగడం లేదు. ఇవి చాలా వరకు సమంజసమే. జగన్ దృష్టికి వెళ్లినా ఒప్పుకునేవే. కానీ జగన్ దృష్టికి వెళ్లడం ఎలా అన్నదే సమస్య ఎవరు తీసుకెళ్తారు అన్నదే పెద్ద సమస్య.

కేవలం ఈ చిన్న పాయింట్ వల్ల మూడు రాష్ట్రాల్లో థియేటర్ వ్యవస్థ స్తంభించిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వందల కోట్ల టర్నోవర్ ఆగిపోయింది. నిజానికి ఇది మంచి పరిణామం కాదు. జగన్ టికెట్ వ్యవస్థను కంట్రోలు చేయడం అనుకోవడం వరకు మంచి విషయమే. ఇష్టం వచ్చినట్లు వందలకు వందలు టికెట్ రేట్లు పెంచేసి, జనాలను దోచేసే పనిని సినిమా జనాలు స్టార్ట్ చేసారు. అది అతిగా మారిపోయింది. వికటించింది. దాంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది.  

కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిపోయింది అన్న చందంగా వుంది జగన్ తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఈ నిర్ణయం సవరణ అన్నది ఎలాగూ తప్పదు. ఎప్పుడో అప్పుడు అది జరుగుతుంది. కానీ ఎంత తొందరగా జరిగితే అంత మంచింది. ఆంధ్రలో పరిస్థితి వల్ల తెలంగాణలో కూడా థియేటర్లు తెరవలేని పరిస్థితి. బెంగళూరులో కూడా థియేటర్లకు కంటెంట్ లేని స్థితి నెలకొంది. 

ఇక ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో అన్నదే జవాబు తెలియని ప్రశ్న. అది రేపయినా వచ్చు..లేదా నెల అయినా పట్టొచ్చు. అసలు మారకపోవచ్చు. ఎందుకంటే అది సీఎం జగన్ మనోభిప్రాయం మీద ఆధారపడి వుంటుంది. దాన్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. ఆయనకు ఆయన అనుకుని చేయాలి తప్ప. అంతవరకు సినిమా పరిశ్రమ చేష్టలుడిగి వుండాల్సిందే.

చాణక్య

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి