కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా సరదా కబుర్లు చెబుతుంటారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆమె తనదైన స్టైల్లో చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉత్తరప్రదేశ్‌లో స్మృతి ఇరానీ ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పాపులారిటీ అమాంతం రెట్టింపైంది.
ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలను ఎంత తీవ్రంగా చూస్తారో, వ్యక్తిగత విషయానికి వస్తే అంత కూల్‌గా ఉండడం ఆమె ప్రత్యేకత. తాజాగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు ఎలాంటి పరీక్ష పెట్టాలో ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ సరదా పోస్టు చేశారు. దాని గురించి తెలుసుకుందాం.
‘మీరు ఒక వ్యక్తిని పెళ్లాడే ముందు.. ఆ వ్యక్తితో స్లో ఇంటర్నెట్ కంప్యూటర్ ఇచ్చి దాని మీద పనిచేయమనండి. అప్పుడు ఆ వ్యక్తిలో సహనంతో పాటు ఆ సమయంలో ప్రవర్తించే తీరును పరీక్షించొచ్చు. ఆ తర్వాత ఒక అంచనాకు వచ్చి పెళ్లాడండి’ అంటూ ఆమె సరదాగా చెప్పారు.
సరదా అనే మాటగానే, పెళ్లి తర్వాత జీవితం సుఖసంతోషాలతో సాగాలంటే దంపతులిద్దరికీ ఓర్పు, సహనం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పకనే చెప్పారు. ఆవేశం మనిషిలో విచక్షణను చంపేస్తుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. దేనికైనా సహనం ప్రధానమని చెప్పడమే స్మృతి ఇరానీ పోస్టు సారాంశం.
అదే పోస్టులో చివరిగా జీవితం గురించి ఓ సందేశాన్ని కూడా ఇచ్చారామె. జీవితంలో కష్టపడకుంటే.. ఏదీ పర్ఫెక్ట్ కాదని.. ఇది ‘ఆంటీ అడ్వైజ్’ అంటూ సలహా ఇవ్వడం గమనార్హం. ఆంటీ చెబితే కాదనే వాళ్లు ఎవరుంటారు? స్మృతి ఇరానీ చెప్పిందాంట్లో ఎంతైనా నీతిని గ్రహించొచ్చు. అది ఆయా వ్యక్తుల చైతన్యాన్ని బట్టి ఉంటుందని చెప్పొచ్చు.