ఎన్జీటీ ఆదేశాల‌పై ఏపీ ఆశ్చ‌ర్యం!

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తాజాగా ఇచ్చిన ఆదేశాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ఆశ్చ‌ర్య‌పోతోంది. ఇవేమి ఆదేశాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జానీకం ప్ర‌శ్నిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి సంబంధం లేకుండా…

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తాజాగా ఇచ్చిన ఆదేశాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ఆశ్చ‌ర్య‌పోతోంది. ఇవేమి ఆదేశాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జానీకం ప్ర‌శ్నిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి సంబంధం లేకుండా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని సంద‌ర్శించి నివేదిక ఇవ్వాల‌ని కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను ఎన్జీటీ ఆదేశిం చింది. అస‌లేం జ‌రిగిందంటే…

ఏపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టింద‌ని ఎన్జీటీలో గ‌వినోళ్ల శ్రీ‌నివాస్‌, తెలంగాణ ప్ర‌భుత్వం పిటిష‌న్లు వేసింది. ఈ పిటిష‌న్ల‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ విచార‌ణ చేప‌ట్టింది. 

ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని గతంలో కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని ఎన్జీటీకి కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు అఫిడవిట్ స‌మ‌ర్పించింది. కానీ కేంద్ర పర్యావరణ శాఖ స్పందించ‌లేదు.

మరోవైపు ధిక్కరణ పిటిషన్లపై ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించడం లేదని.. కేవలం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీకి చెందిన అధ్యయనాల పనులు మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఏపీ ప్రభుత్వం సహకరించనందున స్వయంగా ఎన్జీటీ బృందమే సందర్శించాలని తెలంగాణ ఏఏజీ రామచంద్రరావు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. హెలికాప్టర్‌ సహా అన్ని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగానే వెళ్లాలని కృష్ణా బోర్డును ఆదేశించడం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఈ ఆదేశాల‌పై ఏపీ స‌మాజం విస్మ‌యానికి గురి అవుతోంది. 

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పరిశీలన జరిపిన తర్వాత స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. కేసు విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వ దుందుడుకు చ‌ర్య‌ల‌పై మాత్రం కొన్ని వ్య‌వ‌స్థ‌లు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూ, క‌రవు పీడిత ప్రాంతానికి కాసిన్ని నీళ్లు ఇస్తామ‌నే ప్ర‌య‌త్నాల‌కు అడ్డు త‌గ‌ల‌డంపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.