పూర్తి సెలవులు.. సగం జీతం.. వినూత్న పథకం

కరోనా కష్టకాలంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నాయి. అదే సమయంలో ఖర్చులు తగ్గించునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. విదేశాల్లో లాగా ఇక్కడ…

కరోనా కష్టకాలంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నాయి. అదే సమయంలో ఖర్చులు తగ్గించునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. విదేశాల్లో లాగా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలపాటు సెలవులిస్తారు. ఈ సెలవు రోజుల్లో వారికి సగం జీతం ఇస్తారు. అంటే పని ఉండదు, సగం జీతం వస్తుందనమాట. ఈ ఖాళీ సమయంలో వారు ఇతర ఉపాధి వెదుక్కోవడమో లేక వ్యాపారాలు మొదలుపెట్టడమో చేయొచ్చు. అంటే ప్రభుత్వానికి సగం జీతం మిగులుతుంది, అదే సమయంలో ఆయా ఉద్యోగుల ఉపాధి కార్యకలాపాల ద్వారా అదనంగా ఆదాయం సమకూరుతుంది.

ఏడాదికి 6వేల కోట్లు మిగులు..

విద్య, వైద్యం, పోలీస్, రెవెన్యూ వంటి విభాగాలను దీని నుంచి మినహాయించారు. మిగతా విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మూడేళ్ల నుంచి ఐదేళ్ల పాటు సెలవు తీసుకోడానిక అర్హులు. సెలవు సమయంలో వారికి ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్స్ లు ఉండవు. సెలవు పూర్తయిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరతారా లేదా, వ్యాపారాలే కొనసాగిస్తారా అనేది ఉద్యోగుల ఇష్టానికే వదిలేస్తారు.

ప్రస్తుతం అమెరికా, యూకే వంటి వివిధ దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారు. రూ.2.53 లక్షల కోట్ల అప్పు భారం మధ్యప్రదేశ్ పై ఉంది. కరోనా వల్ల 30 శాతానికి పైగా ఆదాయం తగ్గిపోయింది. ఈ దశలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఇటీవలే నిరర్థక ఆస్తుల అమ్మకం ద్వారా 500 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇది ఏమూలకు సరిపోదు.

ఈ దశలో ఇలా పెయిడ్ హాలిడేస్ స్కీమ్ తెరపైకి తెస్తోంది. ఏటా 6వేల కోట్ల రూపాయల మిగులుకు ప్లాన్ చేసింది. ఆర్థిక శాఖ మంత్రి జగదీష్, అధికారులతో కలసి ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. దీనికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అమలులోకి వస్తుంది. 

పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచి కేంద్ర ప్రభుత్వం ఖజానా భారాన్ని సర్దుబాటు చేసుకుంటుంటే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలా కొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయో లేదో చూడాలి.