కులం పేరెత్తకపోతే లేదా దాన్ని చర్చించకపోతే అది మాయమౌతుందా? అనే ప్రశ్నను రెండు రోజుల నుంచి ‘నారప్ప’ సినిమాను చూసినోళ్లలో చాలా మంది వేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రలకు కులం పేరు పెట్టకపోయినా, కులాల్లో హెచ్చుతగ్గులున్నాయనే భావనే దౌర్జన్యం, అన్యాయాలకు కారణమనే మాట నారప్పలో వినపడకపోవడం అనేక మంది తెలుగువారికి అనుచితంగా కనిపిస్తోంది.
అనేక ఊళ్లలో హింసకు, కులానికి సంబంధం లేకుండా ఉండదు చాలా సందర్భాల్లో. కులం గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అది కులాన్ని అంత త్వరగా కుళ్లబొడిచి, ఖతం చేస్తుందనే మూఢ నమ్మకంతో పాటు బలమైన విశ్వాసం ఉన్న నాకు కూడా– కులాల పేర్లు, కనీసం కులం సామాజిక హింసకు కారణమనే మాటైనా నారప్పలో వినిపించకపోవడం లోటేననిపించింది.
నారప్పలో ప్రధాన పాత్రధారులైన ఇద్దరూ– దగ్గుబాటి వెంకటేశ్, ప్రియమణి వరుసగా కారంచేడు మూలాలునన్న కమ్మ, పాలక్కాడు (కేరళ) తమిళ అయ్యర్ బ్రాహ్మణ కులాలకు చెందినవారని నేను ఇక్కడ చెప్పడం అప్రస్తుతం కాదుగాని, అనవసరం కూడా లేదు.
నారప్పలో దుర్మార్గాలకు కులం కారణమనే మాట వినపడలేదని అంటున్నవారిలో కొందరికి– నిన్న తమిళనాడు సూపర్‌లీగ్ క్రికెట్ ఆట సందర్భంగా భారత క్రికెటర్ సురేష్ రైనా, తాను కూడా బ్రాహ్మణుడినని అనడం చాలా తప్పుగా కనిపించింది.
ఓ క్రికెటర్ తన కులం ఏమిటో చెప్పడం సామాజిక ఆరోగ్యానికి మంచిదే! అయితే, ‘‘మీరు చెన్నై కల్చర్‌తో ఎలా కలిసిపోయారు? మీరు తమిళ వేష్టి (అడ్డపంచె) కట్టుకుని తమిళ తరహా డాన్సులు వేయడం కనిపించింది కదా!’’ అని క్రికెట్ కామెంటేటర్ ఒకరు ప్రశ్నించినప్పుడు, ‘ నేను కూడా బ్రాహ్మణుడినని అనుకుంటా. 2004 నుంచీ చెన్నైలో ఆడుతున్నా. ఇక్కడి సంస్కృతిని ప్రేమిస్తా. తోటి ఆటగాళ్లంటేనూ ఇష్టమే,’ అని సురేష్ రైనా చెప్పడంతో వివాదం చెలరేగింది.
బ్రాహ్మణుడు అయితేనే చెన్నై కల్చర్ నచ్చుతుందా? ఈ పాత చెన్నపట్నంలో బ్రాహ్మణీయ కల్చర్ ఒక్కటే ఆధిపత్య సంస్కృతి కానప్పుడు, తాను బ్రాహ్మణుడిని కాబట్టే తనకు చెన్నై నచ్చిందని చెప్పడం నిజంగానే రైనా చేసిన ‘నేరం’. రైనా అనే ఇంటిపేరు కశ్మీరీ పండితులది. అంటే బ్రామ్మలది. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి వచ్చి దిల్లీ పక్కనున్న పశ్చిమ యూపీ నగరం గాజియాబాద్ సమీపంలో స్థిరపడిన కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సురేష్ –మనలో చాలా మందిలాగానే తల్లిదండ్రులకు నచ్చిన బ్రాహ్మణ యువతినే పెళ్లాడాడు.
అన్నేళ్లుగా చెన్నైలో క్రికెట్ ఆడుతున్న రైనాకు అక్కడ బ్రాహ్మణ కల్చరే ఆధిపత్య సంస్కృతి కాదనీ, బ్రాహ్మణులను అనేక రంగాల్లో ఓడించి పైకొచ్చిన అనేక శూద్ర, దళిత వర్గాల సంస్కృతికి కూడా నగరంలో చాలా పెద్ద చోటు ఉందని తెలిసి ఉండాల్సింది. ఎమైనా కశ్మీరీ యువకుడికి కన్యాకుమారి ఉన్న తమిళనాడు రాజధాని చెన్నైతో మమేకం కావడానికి అతని కులం (బ్రాహ్మణ్యం) అక్కరకు రావడం నిజంగానే ముదావహం. ఈ సందర్భంగా మీకు నేనెప్పుడో చదివిన ఓ పాత సంగతి చెప్పాలి.
19వ శతాబ్దంలో బ్రిటీషోళ్లు ఇండియాలో కులాల పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారట. అంతటి బృహత్కార్యక్రమం చేయగలమో లేదో ముందు మనను మనం పరీక్షించుకోవాలని బుద్ధిజీవి ఒకరు సలహా ఇచ్చారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న బ్రాహ్మణుల్లోని శాఖోపశాఖల లిస్టు రాసి, అవి ఎన్నో లెక్కతేల్చగలిగితే దేశంలోని నానా కులాల జాబితా రూపొందించడం కష్టమేమీ కాదని బ్రిటిష్ సర్కారు నిర్ణయించింది. ఇలా చివరికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ, గుజరాత్ నుంచి బెంగాల్ వరకూ ఉన్న బ్రాహ్మణలు పన్నెండొందలకు పైగా శాఖల పేర్లతో జీవిస్తున్నారని తెల్లోళ్లు చెప్పాల్సివచ్చింది.
ప్రాంతాల మధ్య కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉన్నా మనుషులను హిందూ మతం కాకపోయినా కులం అయినా కలుపుతోందనే శుభవార్త మద్రాసు నుంచి నాగ్‌పూర్ వరకూ వెళ్లి ఉంటే నిజంగా మంచిదే. అయితే, చెన్నై కల్చర్ అంటే ఎక్కడెక్కడి బ్రాహ్మణలకు ఆతిధ్యమిచ్చే సంస్కృతి అని పొరపడిన సురేష్ రైనాకు తమిళ, చెన్నపట్నం చరిత్రలు ఎవరు చెప్పాలి?
చెన్నై మహానగరంలోని బ్రాహ్మణుల బలమైన స్థావరాలైన త్యాగరాయనగర్ (టీనగర్), ఆళ్వార్‌పేట బ్రాహ్మలంతా ఒక తీరున బతకరని, టీనగర్ సాంప్రదాయ బ్రాహ్మణులు గుళ్లలోని తీర్థం తాగితే, సంపన్నులైన ఆళ్వార్‌పేట ‘ఆధునిక’ బ్రాహ్మణులు ఇళ్లలోనే స్కాచ్ విస్కీని తాగుతారని ( తమిళ డబ్బింగ్ సినిమా బామా రుక్మిణిలో జెమినీ గణేశన్) ఈ కశ్మీరీ బ్రాహ్మణ ఆటగాడికి ఎవరైనా చెబుతారేమో చూద్దాం!
నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ జర్నలిస్ట్