సీనియర్ కమెడియన్ మాటలు బుకాయింపులేనా?

వంద అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయాలనేది సామెత. కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పి టికెట్ దక్కించుకోవాలనేది రాజకీయ ప్రపంచం నిరూపిస్తున్న సామెత! తిమ్మిని బమ్మి చేయాలి.. మాటలతో మాయ చేయాలి. లేని బలాన్ని…

వంద అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయాలనేది సామెత. కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పి టికెట్ దక్కించుకోవాలనేది రాజకీయ ప్రపంచం నిరూపిస్తున్న సామెత! తిమ్మిని బమ్మి చేయాలి.. మాటలతో మాయ చేయాలి. లేని బలాన్ని ఉన్నట్టు నమ్మించాలి. ఉన్న విభేదాలను లేనట్టుగా భ్రమింపజేయాలి.. ఏమైనా చేయాలి.. ఎంతైనా చేయాలి.. అల్టిమేట్ గా పార్టీ టికెట్ దక్కించుకోవాలి అన్నదే లక్ష్యంగా నాయకుల తీరుతెన్నులూ మొన్నమొన్నటి దాకా సాగుతూ వచ్చాయి.

అయితే.. దాచి పెట్టిన విషయాలు ఎన్నాళ్లు దాగుతాయి. విభేదాలు నిజమే అయితే.. వాటికి కప్పిన ముసుగు ఎన్నాళ్లు ఉండగలుగుతుంది? ఇప్పుడు అదే జరుగుతోంది. భారతీయ జనతాపార్టీ తరఫున ఆందోలు నుంచి ఎమ్మెల్యేగా భాజపా తరఫున బరిలో ఉన్న మాజీమంత్రి, సీనియర్ కమెడియన్ బాబూ మోహన్ కొడుకు తాజాగా భారాసలో చేరడం కొత్త ట్విస్టుగా కనిపిస్తోంది.

బాబూమోహన్ చాలాకాలంగా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆందోలు నుంచి గెలిచి గతంలో మంత్రిగా కూడా చేసిన ఆయన.. ఈసారి బిజెపి టికెట్ ఆశించారు. కానీ దరఖాస్తుల దశలో ట్విస్టు ఏంటంటే.. ఆయన కొడుకు ఉదయభాస్కర్ కూడా ఇదే టికెట్ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నాడు. దీనితో చాలా సహజంగానే.. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

బాబూ మోహన్ దీని మీద అలిగారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నాక.. ఆ ప్రచారం సహజంగానే వస్తుంది. కానీ బాబూమోహన్ పార్టీ ఆ ప్రచారం చేయిస్తున్నట్టుగా అలిగారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ మీద ధ్వజమెత్తారు. తనకు తనకొడుకుకు మధ్య విభేదాల ప్రచారం చేస్తున్నారని, తాను బిజెపిలో ఉండదలచుకోలేదని, పార్టీ టికెట్ ఇచ్చినా పోటీచేయనని, రాష్ట్రంలో పార్టీకోసం ప్రచారం చేయనని చాలా చెప్పారు. తీరా చివరికి పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం బరిలో ఉన్నారు.

అయితే ఈలోగా తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా జరిగిన ప్రచారం నిజమే అని నిరూపించేలా.. ఆయన కొడుకు ఉదయ్ తాజాగా గులాబీ పార్టీలో చేరారు. అక్కడ ఎమ్మెల్యేగా గులాబీ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ తో కలిసి హరీష్ రావు ఎదుట పార్టీలో చేరారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని అంటూ.. తద్వారా పార్టీలో తన భవిష్యత్తుకు ఆయన బాటలు వేసుకుంటున్నారు. 

ఇదంతా ఓకే గానీ.. విభేదాలు సృష్టిస్తున్నారంటూ గతంలో బాబూమోహన్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా.. టికెట్ కోసం బుకాయింపులేనా.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు.