మునుగోడును బాహుబలిలా భావిస్తున్న కేసీఆర్

రాజకీయాలు ఎంత చిత్రవిచిత్రంగా ఉంటాయో మునుగోడు ఉపఎన్నిక ఎపిసోడ్ ను చూస్తే తెలుస్తుంది. అది సహజమైన (అంటే మరణం వల్ల సంభవించిన) ఉప ఎన్నిక కాదు. ఉద్దేశపూర్వకంగా తెచ్చిపెట్టిన ఉప ఎన్నిక. బీజేపీ తన…

రాజకీయాలు ఎంత చిత్రవిచిత్రంగా ఉంటాయో మునుగోడు ఉపఎన్నిక ఎపిసోడ్ ను చూస్తే తెలుస్తుంది. అది సహజమైన (అంటే మరణం వల్ల సంభవించిన) ఉప ఎన్నిక కాదు. ఉద్దేశపూర్వకంగా తెచ్చిపెట్టిన ఉప ఎన్నిక. బీజేపీ తన బలాన్ని కేసీఆర్ కు చూపించాలని భావించిన ఉప ఎన్నిక. నిజానికి దీన్ని ఉప ఎన్నిక అనడం కంటే కురుక్షేత్ర సమరం అనడం సమంజసం.

ఉప ఎన్నికను గురించి ఎలా చెప్పుకున్నా కేసీఆర్ మాత్రమే కాదు అన్ని పార్టీల దృష్టిలో ఇదో బాహుబలి అనడంలో సందేహం లేదు. ప్రతీ పార్టీ దాని స్థాయికి మించి వ్యూహాలు పన్నుతోంది. అంగబలాన్ని మోహరిస్తోంది. అర్ధ బలాన్ని ప్రదర్శిస్తోంది. ఇక కేసీఆర్ విషయానికొస్తే …ఇది టీఆర్ఎస్ స్థానం కాకపోయినప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ ఎన్నికను సవాల్ గా తీసుకున్నారు. పూర్తి శక్తి యుక్తులను పెడుతున్నారు.

ప్రధానంగా బీజేపీకి తన శక్తిని చూపించాలనే పట్టుదల పెరిగింది. ఉప ఎన్నికకు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ 88 మంది ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా రంగంలోకి దింపుతున్నారు. దీన్నిబట్టి కేసీఆర్ తన బలగాన్ని ఏ విధంగా మోహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇలా చేయడం గులాబీ పార్టీ చరిత్రలో మొదటిసారి. 1500 మంది నాయకులు, కార్యకర్తలతో 50 రోజుల ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాలను, గ్రామాలను, మునిసిపాలిటీలని కవర్ చేస్తారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా ప్రచారానికి వియోగిస్తున్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం కేసీఆర్ కోట్ల రూపాయలు గుప్పించడానికి వెనుకాడటంలేదు. ఇంత చేస్తున్నందుకు ఫలితం అనుకూలంగా వస్తే ఓకే. రాకపోతే పరిస్థితి ఏమిటి?