“సార్పట్టు పరంపర” తెలుగు లిపిని పరపరా చింపేసింది. శబ్దంలోనే కాకుండా దృశ్యంలో కూడా తెలుగు నేపథ్యం కనపడాలన్న దర్శకుడి ఆలోచన మంచిదే. కానీ ఆ పని తెలుగువాడిని అప్పజెప్పినట్టు లేదు. ఏ అరవ మహానుభావుడు లిప్యంతరీకరణ చేసాడో గానీ తెలుగుభాష మీద, లిపి మీద అభిమానమున్నవాళ్లకి చిరాకు తెప్పించేసాడు.
తమిళులు వాళ్ల భాషని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. మరి సాటి తెలుగు భాషకి ఆ గౌరవం ఇవ్వక్కర్లేదా? లిపిలో దోషాలు పట్టించుకోనక్కర్లేదా? ఏదో ఒకటి రెండు చోట్ల అయితే పొరపాటనుకోవచ్చు. మొత్తం సినిమాలో తెలుగు అక్షరాలు కనిపించినప్పుడల్లా తప్పులే.
తప్పులున్నా ఒకరకం. అసలు ఒత్తులు, పొల్లులు పెట్టే తీరదికాదు కదా. యూని కోడ్ లో టైప్ చేసి వర్డ్ డాక్యుమెంట్ లో కాపీ పేస్ట్ చేస్తే ఒక్కోసారి ఇలాంటి సాంకేతిక తప్పిదం జరుగుతుంది.
ఆ వర్డ్ డాక్యుమెంట్ ని ఈ-మెయిల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని కాపీ పేస్ట్ చేసే ఎడిటర్ భాషరానివాడైతే యథాతథంగా అదే తప్పుని అన్ని చోట్లా అతికించుకుంటూ పోతాడు. ఇక్కడ అదే జరిగుండొచ్చు. కానీ ఫైనల్ గా ఏది పోస్టయ్యింది అనేదే కదా ముఖ్యం. చూసుకోవాలి కదా.
అసలే ప్రాంతీయ భాషల లిపులు ఇంగ్లీషు అక్షరాల వెల్లువలో కొట్టుకుపోతున్నాయి. దానికి తోడు ఇలాంటి అశ్రద్ధల వల్ల భాషకి ఇంకా ద్రోహం జరుగుతుంది.
చిన్న దానికి ఇంత రాద్ధాంతమా అనుకునే వారికి ఏమీ చెప్పెది ఒక్కటే… ఇది చిన్నది కాదు. సినిమా బాగుంది. నలుగురూ చూస్తారు. ఆ నలుగురి కళ్లల్లోనూ ఈ అక్షరదోషాల భాషే కనపడుతుంది. అదీ భాషాప్రేమికుల బాధ.
ఇకనైనా డబ్బింగ్ జరిగేటప్పుడు మనవాళ్లైనా, ఇతర భాషల వాళ్లైనా తెలుగు లిపి విషయంలో కాస్త ఒళ్లుదగ్గర పెట్టుకుంటే మంచిది.