మైసూరాను నిల‌దీసిన‌ త‌న‌యుడు

రాయ‌ల‌సీమ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డిని వ‌రుస‌కు త‌న‌యుడైన‌ (త‌మ్ముడు వెంక‌ట‌సుబ్బారెడ్డి కుమారుడు) జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి నిల‌దీశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తిన జ‌ల‌వివాదం నేప‌థ్యంలో… ఇద్ద‌రు…

రాయ‌ల‌సీమ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డిని వ‌రుస‌కు త‌న‌యుడైన‌ (త‌మ్ముడు వెంక‌ట‌సుబ్బారెడ్డి కుమారుడు) జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి నిల‌దీశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తిన జ‌ల‌వివాదం నేప‌థ్యంలో… ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఉద్దేశ పూర్వ‌కంగానే రాజకీయ చేస్తున్నార‌ని మైసూరారెడ్డి విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని మైసూరా ఆరోపించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే డాక్ట‌ర్ మూలె సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త‌న పెద‌నాన్న‌ను ప్ర‌శ్న‌ల‌తో నిలదీశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మైసూరా చేసిన ప్ర‌తి విమ‌ర్శ‌కు త‌న‌దైన స్టైల్‌లో డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి సూటిగా, ఘాటుగా స‌మాధానం చెప్పారు. టీడీపీ హ‌యాంలో న‌దీ జ‌లాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌లించుకుపోతే మైసూరారెడ్డి నిద్ర‌పోయారా? అని ప్ర‌శ్నించారు.  

తెలంగాణ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తున్న రోజుల్లో మాజీ మంత్రి మైసూరా మౌనంగా ఉన్నార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేయడం దుర్మార్గమని మండిప‌డ్డారు. 2014–19 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిం చేందుకు శ్రీకారం చుట్టిందని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

ఆ అంశంపై చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైసూరారెడ్డి నోరు తెర‌వ‌క‌పోవ‌డం రాయలసీమపై ఆయనకు ఏ పాటి ప్రేమ ఉన్న‌దో చెప్ప‌క‌నే చెబుతోంద‌న్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు త‌న సొంత ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణ‌కు తాకట్టు పెడుతుంటే నోరెత్తని మైసూరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పెద‌నాన్న‌పై సుధీర్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు మైసూరా  ఎందుకు కలిశారో, ఏం మంతనాలు జరిపారో బహిరంగ రహస్యమే అని ఆయ‌న అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే..  చంద్రబాబుకు మైసూరా అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.  

నదీ జలాల పంపిణీ అనేది సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులు చేయాల్సి ఉంటుందని సుధీర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు మైసూరా ప్ర‌య‌త్నిస్తే, ఆయ‌న్ను ఓ రేంజ్‌లో త‌మ్ముని కుమారుడైన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి త‌ప్పు ప‌ట్ట‌డం వైర‌ల్ అవుతోంది.