8 ఏళ్ళలో పోలవరానికి ఇచ్చింది 11,182 కోట్లు!

పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం 11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు…

పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం 11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధుల విడుదల జరిగినట్లు ఆయన తెలిపారు. 

పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం 55 వేల 657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే ఎనిమిదేళ్ళ వ్యవధిలో  కేంద్రం ఇచ్చింది కేవలం 11,182 కోట్ల రూపాయలు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

రాజధాని నగరం(అమరావతి)లో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం 2014 నుంచి 2017 మధ్య కాలంలో కేంద్ర సహాయం కింద 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర గ్రాంట్‌ కింద 2014 నుంచి ఇప్పటి వరకు 1750 కోట్లు విడుదల అయ్యాయి. 

వనరుల మధ్య ఏర్పడిన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు 2014 నుంచి 2017 మధ్య కాలంలో ప్రత్యేక సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3979 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం కింద ఇచ్చిన హామీలలో భాగంగా నెరవేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల వివరాలను కూడా మంత్రి సవివరంగా తన జవాబులో పొందుపరచారు. ఏప్రిల్‌ 2018 నుంచి మార్చి 2019 వరకు రాష్ట్రంలో 88 కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల అమలు కోసం 10,632 కోట్ల రూపాయలు విడుదలైనట్లు మంత్రి తెలిపారు. 

ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు రాష్ట్రంలో 84 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం 11,112 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు 79 కేంద్ర పథకాల అమలు నిమిత్తం 12,904 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఏప్రిల్‌ 2021 నుంచి జూలై 2021 వరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 31 కేంద్ర పథకాల కోసం 1,794 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.