ఆనం ఉంటాడు సరే.. పార్టీ టికెట్ ఇవ్వాలి కదా..?

ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి మహానాడు కార్యక్రమానికి వెళ్లి అక్కడ నారా లోకేష్ ని కలిసిన వార్త సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె, టీడీపీ నాయకుల్ని కలవడం ఏంటి..?…

ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి మహానాడు కార్యక్రమానికి వెళ్లి అక్కడ నారా లోకేష్ ని కలిసిన వార్త సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె, టీడీపీ నాయకుల్ని కలవడం ఏంటి..? అసలేం జరుగుతోందంటూ టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోయింది. 

అయితే కైవల్యా రెడ్డి భర్త, అత్త అందరూ టీడీపీ నాయకులే. ఆమె అత్త టీడీపీ మాజీ ఎమ్మెల్యే. అయితే గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు కలిశారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీని వెనక ఆనం మంత్రాంగం ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 

తన కుమార్తె చిన్నపిల్ల కాదని, ఆమె రాజకీయ నిర్ణయాలకు తాను బాధ్యుడిని కాదని ఆనం క్లారిటీ ఇచ్చినా ఆ డోస్ సరిపోలేదు.

ఆనం రాజకీయం విచిత్రం..

2014లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆనం అధికార టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల నాటికి జనంలో జగన్ బలపడటం చూసి మళ్లీ కండువా మార్చేశారు. కానీ తాను అనుకున్న నియోజకవర్గం రాలేదు. ఎక్కడో మూలన ఉన్న వెంకటగిరి టికెట్ ఆఫర్ చేశారు జగన్. కానీ ఆనం గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆయన.. పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు.

జిల్లాల పునర్విభజన విషయంలో నిరాహార దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి బాగానే హడావిడి చేశారు. స్వపక్షంలో విపక్షంలా మారారు, ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదేదో తేడాగా ఉందే అనుకునే సమయంలో.. జిల్లా నుంచి కాకాణికి మంత్రి పదవి రావడంతో ఆనంలో మార్పు మొదలైంది. సడన్ గా ఆయన ప్లేటు ఫిరాయించారు. వైసీపీ కార్యక్రమాల్లో మిగతావారి కంటే చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు.

అనిల్ కి మంత్రి పదవి పోవడం, కాకాణికి రావడంతో ఆనంలో మార్పు మొదలైందని అంటున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల గొడవ.. ఆనం-అనిల్ వర్గాల మధ్య మరోసారి చిచ్చు పెట్టింది. నెల్లూరు నగరంపై పట్టు నిలుపుకోడానికి ఆనం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆ క్రమంలో ఆయన అనిల్ తో సై అంటే సై అంటున్నారు.

ఆనం సరే.. పార్టీ పరిస్థితి ఏంటి..?

వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ బలపడిందనే సంకేతాలుంటే ఆనం పార్టీ మారడానికి ఏమాత్రం మొహమాట పడరు. అదే సమయంలో నెల్లూరు సిటీ టికెట్ ని డిమాండ్ చేసి మరీ సాధించుకుంటారు. తన కుమార్తె కైవల్యారెడ్డికి ఆత్మకూరు టికెట్ కూడా సాధించుకోగలరు. టీడీపీకి ఎలాగూ అభ్యర్థులు లేరు కాబట్టి.. ఆనం కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు వెనకాడరు.

మరి టీడీపీపై ఆనంకు గురి కుదరకపోతే పరిస్థితి ఏంటి..? వైసీపీలోనే కొనసాగితే ఆయనకు టికెట్ ఎక్కడ ఇస్తారు. వెంకటగిరిలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి పాగా వేయాలనుకుంటున్నారు. ఆయనకు ఆల్రెడీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇటు నెల్లూరు సిటీకి వద్దామనుకుంటే.. అనిల్ కి జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. సో.. ఇదీ కుదరదు.

ఒకవేళ ఆనం వైసీపీలోనే ఉంటే మాత్రం ఆయనకు దాదాపుగా టికెట్ దొరక్కపోవచ్చు. కేవలం ఆనం కుటుంబం నుంచి కైవల్యా రెడ్డి ఆత్మకూరులో పోటీ చేసే అవకాశం ఉంటుంది.