మహానాడు వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇవాళ గ్రీష్మ వ్యాఖ్యలను తలదన్నేలా అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మొదటి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. దాన్నే నేడు కొనసాగించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై చెలరేగిపోయారు. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ ఏమన్నారంటే….
మహానాడులో సీఎం జగన్‌పై టీడీపీ నేతలు హద్దులు దాటి నోరు పారేసుకున్నారని మండిపడ్డారు. జగన్‌పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని దువ్వాడ హెచ్చరించారు. జగన్ గురించి ఎక్కువ మాట్లాడితే అచ్చెన్నాయుడి తాట తీస్తానని హెచ్చరించారు.
అంకుశం సినిమాలో విలన్‌ని కొట్టినట్టు… అచ్చెన్నను రోడ్డుపై ఈడ్చిఈడ్చి కొడతానని చెలరేగిపోయారు. అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన ఆశయంగా దువ్వాడ ప్రకటించారు. జగన్ కోసం ప్రాణాలర్పించేందుకు ఆత్మాహుతిదళంగా మారేందుకైనా తాను సిద్ధమని ప్రకటించడం గమనార్హం.
తనకు ప్రాణం అంటే భయం, జీవితంపై ఆశ లేదని దువ్వాడ చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది. 2014లో టెక్కలిలో అచ్చెన్నాయుడి చేతిలో దువ్వాడ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దువ్వాడ, అచ్చెన్నాయుడి మధ్య రాజకీయం కంటే వ్యక్తిగత వైరం ఉన్న రీతిలో వ్యవహారం కొనసాగుతోంది. దువ్వాడ పరుష వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.