పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని పెట్టి దాదాపు తొమ్మిదేళ్లు అవుతున్నట్టుగా ఉంది. ఈ తొమ్మిదేళ్లలో పవన్ సాధించుకుంది ప్యాకేజ్ స్టార్, చంద్రబాబుకు దత్తపుత్రుడు అనే ఇమేజే తప్ప మరేం లేదు. 2014 ఎన్నికల్లో తను మద్దతు పలకడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిందంటూ పవన్ కల్యాణ్ అనేక సార్లు అయితే చెప్పుకున్నారు కానీ, తెలుగుదేశం పార్టీ వర్గాలే ఆ విషయం వరకూ వస్తే ఒప్పుకోవు.
అప్పుడు పవన్ కల్యాణ్ మద్దతు లేకపోయినా తాము గెలవగలిగే వాళ్లం అంటూ అప్పుడప్పుడు టీడీపీ నేతలు చెప్పుకున్నారు. అయితే పవన్ మాత్రం తన వల్లనే టీడీపీ గెలిచిందంటూ చెప్పుకుంటూ ఉంటారు. తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు పవన్ లేకపోయినా తాము నెగ్గే వాళ్లమనే తెలుగుదేశం నేతలు, ఇప్పుడు మాత్రం పవన్ ప్రాపకాన్ని కోరుకుంటున్నారు. పవన్ పై చంద్రబాబు నాయుడు వన్ సైడ్ లవ్ ను వ్యక్తపరిచారు.
జనసేనతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పాకులాడుతూ ఉంది. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశంతో జత కట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని స్పష్టం అవుతూనే ఉంది. అవసరమైతే బీజేపీతో తెగదెంపులు చేసుకుని కూడా తెలుగుదేశం పార్టీతో పవన్ కల్యాణ్ జత కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి అంత చేస్తే.. పవన్ కల్యాణ్ సాధించేది ఏమిటి? అనేది శేష ప్రశ్న ప్రస్తుతానికి.
గత ఎన్నికల్లో జనసేన వేరేగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలిందని, దీంతోనే అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీలు వచ్చాయంటూ అప్పట్లోనే తెలుగుదేశం అనుకూల మీడియా చెప్పుకొచ్చింది. మరి రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయగానే.. ఆ ఓట్ల కలయిక జరుగుతుందని లెక్కేసుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు!
రాజకీయాల్లో ఎప్పుడూ వన్ ప్లస్ వన్ టూ కాదనేది సత్యం. తెలుగుదేశం, జనసేనకు వేర్వేరుగా పడ్డ ఓట్లను కూడి చూసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమి పోటీ ఇస్తుందనుకుంటే కేవలం అది పలాయన వాదన అవుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే పడే ఓట్లు వేరు. అవే ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే.. అవే ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లవచ్చు కూడా!
అయినా తెలుగుదేశం, జనసేన పార్టీల కాంబినేషన్ ఒక సారి వచ్చేసింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసినప్పుడే ప్రజలు ఆ సినిమాను చూసేశారు. ఆ కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందో.. 2014 నుంచి 2019ల మధ్యన సాగిన పాలన చాటి చెప్పింది. తెలుగుదేశం పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తున్న ఆ దశలో కూడా పవన్ కల్యాణ్ టీడీపీకే మద్దతుగా నిలిచాడు. ఆడిన మాటలు తప్పుతూ ఉన్నా టీడీపీని, బీజేపీని పవన్ కల్యాణ్ ప్రశించలేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే పవన్ కల్యాణ్ దాడి కొనసాగింది కానీ, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కల్యాణ్ చంద్రబాబును మాత్రం ప్రశ్నించలేదు.
ఇక 2019 లో పవన్ కల్యాణ్ వేరే కూటమితో పోటీ చేయడం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నంగానే అంతా అనుకున్నారు తప్ప పవన్ కల్యాణ్ ఏదో పోరాడుతున్నారని ఎవ్వరూ అనుకోలేదు. చంద్రబాబు స్ట్రాటజీ ప్రకారమే అప్పుడు పవన్ కల్యాణ్ తన పార్టీని పణంగా పెట్టాడు. చంద్రబాబు ఆటలో పావుగా రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయి పవన్ కల్యాణ్ పరువును పోగొట్టుకున్నాడు. మరి అంత జరిగినా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వైపే పవన్ కల్యాణ్ మొగ్గుచూపుతూ ఉన్న వైనం మాత్రం ఆయన ధోరణిని చాటి చెబుతూ ఉంది.
మరి ఇంత చేస్తూ ఈ సారి పవన్ కల్యాణ్ సాధించేది ఏమిటి? ఈ సారి తెలుగుదేశం పార్టీతో గనుక కలిసి పోటీ చేస్తే.. జనాలు ఎగేసుకుని వచ్చి ఓట్లేస్తారా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం అంటూ పవన్ కల్యాణ్ కామెడీ డైలాగులు చెబుతూ ఉంటారు. నిజమే ఏ ప్రభుత్వం మీద అయినా వ్యతిరేకత ఉంటుంది. అయితే ఆ వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు అంది పుచ్చుకోవాలంటే తమ తరఫునుంచి ఏదైనా భరోసా కల్పించాలి. అంతే కానీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని , దాన్ని చీల్చమంటూ కలిసి పోటీచేసేసినంత మాత్రానా అంతా అయిపోదు!
ఇలా అనుకుంటే.. యూపీలో ఇలాంటి ప్రయోగాలు వరసగా జరుగుతున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చకూడదని అక్కడి పార్టీలు రకరకాల వేషాలు వేస్తూనే ఉన్నాయి. ఒకసారేమో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేశాయి. మరోసారి బీఎస్పీని కూడా కలుపుకున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అలా అక్కడ ఓటు బ్యాంకు ఉన్న పార్టీలన్నీ ఏకం అయినా .. ప్రయోజనం దక్కలేదు. ఓట్ల చీలికలు ఉండకూడదని ఆ పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేసుకున్నాయి. ఒకసారేమో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ, మరోసారి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల కలిసి పోటీ. ఆ పై ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను పక్కన పెట్టి, బీఎస్పీ అచేతనంగా మారి, ముస్లిం ఓట్లన్నీ ఎస్పీకే పడ్డాయనే విశ్లేషణల నేపథ్యంలో కూడా.. కమలం పార్టీకి తిరుగు లేకపోయింది!
ఇలాంటి రాజకీయ ఉదాహరణలను పవన్ కల్యాణ్ కు ఎవరైనా చెబుతున్నారో లేదో! తను చంద్రబాబుతో చేతులు కలిపేస్తే జగన్ పని అయిపోతుందనే భ్రమల్లో ఉంటే పవన్ కల్యాణ్ మరోసారి చేదు అనుభవాన్నే పొందవచ్చు తప్ప అంతకు మించి ప్రయోజనం ఉండకపోవచ్చు కూడా. ఇంతజేసీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బాగుపడ్డ పార్టీ ఒక్కటీ లేదు! ఈ అనుభవం పవన్ కు ఇది వరకే ఉంది.అయినా మరోసారి ఆయన చంద్రబాబునే నమ్ముతూ తన పార్టీని పణంగాపెడుతూ పతనావస్థ దిశగా పరుగులు తీస్తూ ఉండటం గమనార్హం!
-హిమ