ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? మూడో వేవ్ ముప్పుని మన అధికారులు ముందే ఊహించారా? తొలి రెండు దశల్లో జరిగిన తప్పిదాలను మూడో దశలో రిపీట్ చేయకూడదని అనుకుంటున్నారా..? ప్రస్తుతం వివిధ జిల్లాల్లో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
కరోనా విషయంలో ఏ చిన్న అనుమానాన్ని కూడా లైట్ తీసుకోడానికి సిద్ధంగా లేరు ఏపీ అధికారులు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను పొడిగించారు, సడలింపు వేళల్ని కుదించారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఇలా..
ఏపీలో కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల విషయంలో తూర్పుగోదావరి జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. గడచిన 20 రోజుల్లో అక్కడ దాదాపు 11వేల కేసులు నమోదయ్యాయి. రోజుకి సగటున 500కంటే కేసులు తగ్గేలా కనిపించడంలేదు. మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ. అందుకే ఆ జిల్లా అధికార యంత్రాంగం ముందు చూపుతో వ్యవహరిస్తోంది.
జిల్లా మొత్తాన్ని ఒకే గాటన కట్టకుండా ఎక్కడికక్కడ స్థానికంగా కంటైన్మెంట్ జోన్లను నిర్థారించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో కర్ఫ్యూ ఆంక్షలు పొడిగించారు. ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అక్కడ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రావడానికి వీల్లేదు, వ్యాపార కార్యకలాపాలు జరగడానికి వీలు లేదు.
నెల్లూరు జిల్లాలో ఇలా..
నెల్లూరు జిల్లాలోని కావలి డివిజన్లో కూడా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, స్థానిక వ్యాపారులతో చర్చించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచేలా ఆంక్షలు విధించాలని సూచించారు.
వ్యాపారులంతా స్వచ్ఛందంగా దీనికి ఒప్పుకున్నారు. జిల్లాలోని పెద్ద చెరుకూరు, చిన్న చెరుకూరు గ్రామాల్లో ఒకేరోజు 100మందికి కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తున్న అధికారులు ఆంక్షలను కట్టుదిట్టం చేస్తున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ తీసేసినా, ఏపీలో మాత్రం రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు కర్ఫ్యూ ఉంటుందని ఇటీవలే సీఎం జగన్ కూడా స్పష్టం చేశారు. ఈ దశలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానిక అధికార యంత్రాంగం కర్ఫ్యూ వేళలను పొడిగిస్తోంది.
థర్డ్ వేవ్ ని ఎదుర్కోడానికి ఏపీ సన్నద్ధం..
మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడు మొదలైనా ఎదుర్కోడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని సీఎం జగన్ ఇటీవల ప్రకటించారు. ఏపీలో వ్యాక్సినేషన్ స్పీడందుకుంది. ఒకవేళ, థర్డ్ వేవ్ లో చిన్నారులు ఎక్కువ ప్రభావానికి గురయినా కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆస్పత్రులు, ప్రత్యేక వార్డుల నిర్మాణం కూడా ఊపందుకుంది.