Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ పాడులోకం గుక్కపట్టి ఏడ్చేలా ...నువ్వు పాడు బిడ్డ‌!

ఈ పాడులోకం గుక్కపట్టి ఏడ్చేలా ...నువ్వు పాడు బిడ్డ‌!

బోనాలపై సింగర్‌ మంగ్లీ పాడిన పాట వివాదానికి దారి తీసింది. ఈ పాట‌లో అభ్యంత‌ర ప‌దాలు ఏమున్నాయంటూ మంగ్లీకి మ‌ద్ద‌తుగా నిలిచిన వాళ్ల సంఖ్య త‌క్కువేం కాదు. అయితే ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజే  మార్చేశామని మంగ్లీ వివ‌ర‌ణ ఇచ్చారు. 

గ్రామదేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో మంగ్లీని పాడుతూ ఉండాల‌ని కోరుతూ సిద్ధార్థి సుభాష్ చంద్ర‌బోస్ అనే ఫేస్‌బుక్ ఖాతాదారుడు పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. ఆ పోస్టులో ఏముందో తెలుసుకుందాం.

"నేను పండిత కుటుంబం నుంచి రాలేదు, చెట్లుపుట్టల్ని పూజించే గిరిజన కుటుంబం నుంచి వచ్చానని" నువ్వు చెప్పుకుంటే ఇక్కడెవరూ క్షమించరు. నిజానికి ఈ నేపథ్యమే నిన్ను తప్పుపట్టడానికి కారణమవుతుందని గుర్తించు.  

"ఆదిభిక్షువు నైన వాడినేమి అడిగేది? ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు" అని పాట రాసినవాడిని, పాడిన వాడిని వ్యాజస్తుతి అని నెత్తికెత్తుకుని వూరేగిన చోట, "శబ్బాస్ రా శంకరా" అని పద్యం రాసిన వాడిని అభ్యుదయం అన్నచోట-

అక్షరం వాళ్ల ఆధిపత్యమనుకునే చోట, స్వరం రాగాల్లో ఒదగాలనే చోట, నీ ఇంటిదేవతని చుట్టం అన్నా, మోతువరి అన్నా తప్పే. నీ కులమేంది? నీ మతమేంది? మారుమూల గిరిజన తండాలో పుట్టిన నీకు సాహిత్యం తెలుసా? ఏ స్వచ్ఛంద సంస్థో చదివిస్తే పదో తరగతి పాసైన నీకు సంగీతం పాడే అర్హతెక్కడిది? ఇట్లా చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవడానికి మనకి జీవితం సరిపోదుగానీ-

మంగ్లీ,

నువ్వు పాడు బిడ్డా! ఆడు బిడ్డా!

ఈ పాడులోకం గుక్కపట్టి ఏడ్చేలా!

తరాల ఆధిపత్యాన్ని కాలితో తంతే ఆవల పడేలా!...అని రాసుకొచ్చారు.

మంగ్లీ రాయ‌ల‌సీమ బిడ్డ‌. ఫెర్ర‌ర్‌కు సంబంధించిన ఆర్డీటీ అనే స్వ‌చ్ఛంద సంస్థ మంగ్లీని చేర‌దీసింది. ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించ‌డంలో సాయంగా నిలిచింది. త‌న మ‌ధుర కంఠంతో తెలుగు స‌మాజాన్ని ఆక‌ట్టుకుంటోంది. అలాంటి గిరిజ‌న బిడ్డ పాడిన పాట‌ను వివాదాస్ప‌దం చేయ‌డం... ఎంత వ‌ర‌కు మంచిదో ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?