తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీని కేంద్ర దర్యాప్తు సంస్థల భయం పట్టుకుంది. సీఎం కేసీఆర్ ఈ విషయమై ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో కయ్యానికి కేసీఆర్ కాలు దువ్వడంతో ఏ క్షణమైనా టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. నిజానిజాలు తెలుస్తాయని బీజేపీ నేతలు ఇప్పటికే హెచ్చరించారు. ఇదిలా వుండగా ఇవాళ ప్రగతి భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ జరిగింది. కేసీఆర్ మాట్లాడుతూ సర్వేలన్నీ తమ వైపే ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 96 సీట్లు టీఆర్ఎస్కే వస్తాయని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా ధైర్యంగా తమ పని చేసుకోవాలని సూచించారు. మునుగోడులో 200 శాతం టీఆర్ఎస్దే గెలుపని స్పష్టం చేశారు. రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమిస్తానన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. బీజేపీ మత రాజకీయాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు బీజేపీ ఇక్కడ చేయాలని అనుకుంటే ఆటలు సాగవని స్పష్టం చేశారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన పని లేదన్నారు. ఆ సంస్థలకు దొరికే పనులు చేయొద్దని కోరారు.
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పెద్ద నాయకులు చురుగ్గా పని చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించొచ్చని కేసీఆర్ అనుమానిస్తున్నట్టుగా ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడుతున్నారనే ప్రచారానికి కేసీఆర్ మాటలు బలం కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి వుంది.