నితీష్ బీజేపీకి షాకిస్తే …జేడీయూకు డబుల్ షాక్

రాజకీయాలను  చదరంగంలో పోలుస్తారు ఎందుకు? ఒకరిని కిందికి పడదోసి మరొకరు పైకి ఎగబాకాలనుకుంటారు కాబట్టి. రాజకీయాలు ఎలా ఉంటాయంటే… తమలపాకుతో నేనొకటి అంటే, తలుపుచెక్కతో నేను రెండంటా అన్నట్లుగా ఉంటాయి. ఎవరూ ఎవరిని ఎదగనివ్వకుండా…

రాజకీయాలను  చదరంగంలో పోలుస్తారు ఎందుకు? ఒకరిని కిందికి పడదోసి మరొకరు పైకి ఎగబాకాలనుకుంటారు కాబట్టి. రాజకీయాలు ఎలా ఉంటాయంటే… తమలపాకుతో నేనొకటి అంటే, తలుపుచెక్కతో నేను రెండంటా అన్నట్లుగా ఉంటాయి. ఎవరూ ఎవరిని ఎదగనివ్వకుండా చూడటమే రాజకీయం అంటే. ఒకరు షాకిస్తే, మరొకరు డబుల్ షాకిస్తారు. మొన్నటివరకు మిత్రులుగా ఉన్న బీజేపీ- జేడీయూ మధ్య ఇదే జరిగింది. బీహార్లో ఒకప్పుడు బీజేపీ జేడీయూకు, లాలూ ప్రసాద్ ఆర్జెడీకి శత్రువుగా ఉండేది.

ఆ తరువాత ఆర్జేడీ అవినీతికరమైన పార్టీ అంటూ బీజేపీతో జేడీయూ జతకట్టింది. ఆర్జేడీని పక్కకు పెట్టింది. కాలక్రమంలో బీజేపీ వైఖరి ప్రధానంగా మోడీ వైఖరి సీఎం నితీష్ కుమార్ కు నచ్చలేదు. బీజేపీకి కటీఫ్ చెప్పేశాడు. మళ్ళీ ఆర్జేడీని కౌగిలించుకున్నాడు. ఇది బీజేపీకి ఒళ్ళు మండించింది. ప్రతీకారం కోసం చూస్తోంది. అవకాశం వచ్చింది. నితీష్ కుమార్ కు డబుల్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. లబోదిబోమంటున్నాడు. నీతీశ్‌ కుమార్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. అయితే ఇది జరిగింది మణిపూర్‌లో. అక్కడ జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో  చేరారు.

ఈ ఏడాది మార్చిలో మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ జేడీ(యూ) ఏడు  సీట్లు దక్కించుకుంది. ఇప్పుడు ఆ వారిలో  ఐదుగురు బీజేపీతో  చేతులు కలిపారు. బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌ కాషాయ పార్టీ వీడి, ఆర్జేడీతో దోస్తీ కట్టిన కొన్ని రోజుల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇది ఒకలాగా జేడీయూ మీద బీజేపీ తీర్చుకున్న ప్రతీకారమని చెప్పొచ్చు. మరోపక్క నీతీశ్‌ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వస్తున్న  సమయంలో  ఈ షాక్‌ తగిలింది. దీంతో  బీజేపీ- జేడీ(యూ) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై బీజేపీ నేతలు సుశీల్‌ కుమార్‌ మోదీ, అమిత్ మాలవీయ విమర్శనాత్మకంగా స్పందించారు.

'అరుణాచల్‌ ప్రదేశ్‌ తర్వాత మణిపూర్‌.. జేడీ(యూ) నుంచి విముక్తి పొందింది. అతి తొందర్లో లాలూజీ  బిహార్‌ నుంచి జేడీ(యూ)ను పారదోలతారు' అంటూ సుశీల్‌ మోదీ ట్వీట్ చేశారు. 'పశ్చిమ్ బెంగాల్‌ వెలుపల ప్రజామోదం పొందేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నించారు. కానీ దారుణంగా విఫలమయ్యారు. ఇప్పుడు నీతీశ్‌ కుమార్‌కు బిహార్‌తో సహా వెలుపల కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది' అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలను జేడీ(యూ) తిప్పికొట్టింది. 'అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్‌కు సంబంధించి మీకొక విషయం గుర్తుచేయాలనుకుంటున్నాను. అక్కడ బీజేపీని  ఓడించి జేడీ(యూ) గెలిచింది. అందుకే పగటికలలు మానండి. మీరు అరుణాచల్‌లో కూటమి ధర్మాన్ని పాటించారా..? ఇప్పుడు మణిపూర్‌ వ్యవహారాన్ని దేశం చూస్తోంది. 2024లో ఈ దేశం జుమ్లాబాస్‌ నుంచి విముక్తి పొందుతుంది. అప్పటివరకు కొంచెం ఆగండి' అంటూ ఆ పార్టీ నేత రాజీవ్‌ రంజన్ సింగ్‌ కౌంటర్ ఇచ్చారు.

బిహార్‌లో జేడీ(యూ).. ఆర్జేడీతో జట్టుకట్టిన దగ్గరి నుంచి నీతీశ్‌ ప్రధాని మంత్రి పదవికి పోటీ పడతారా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో ఆర్జేడీ కూడా మద్దతు పలుకుతోంది. కానీ నీతీశ్ మాత్రం తనకు అలాంటి ఆలోచన లేదంటున్నారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2022 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో గెలవగా.. ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదు, నేషనల్ పీపుల్స్ పార్టీ 7 సీట్లు గెలిచింది. 

38 నియోజకవర్గాల్లో  పోటీ చేసిన జేడీయూ ఏడు సీట్లు గెలుచుకుంది. ఏడుగురిలో ఐదుగురు బీజేపీలోకి జంప్ కావడంతో మణిపూర్ లో జేడియూ అడ్రస్ గల్లతైంది. మరోవైపు అసెంబ్లీలో బీజేపీ బలం 32 నుంచి 37కు పెరిగింది. జేడీయూ ఎమ్మెల్యేల జంప్ మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పాపం …నితీష్ బీజేపీని తక్కువగా అంచనా వేశారు.