గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో వరసగా రెండోసారి జెండా పాతాకా, పంజాబ్ లో అధికారాన్ని సొంతం చేసుకున్నాకా.. ఆప్ కన్ను గుజరాత్ మీద ఉంది. భారతీయ జనతా పార్టీ దశాబ్దాలుగా అధికారాన్ని చలాయిస్తున్న రాష్ట్రం గుజరాత్. అందులోనూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం. గుజరాత్ మోడల్ అంటూ.. గుజరాత్ నుంచి కేంద్రానికి ప్రమోట్ అయ్యారు ఈ ముఖ్యనేతలిద్దరూ. ఈ నేపథ్యంలో వారికి సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం.
ఎక్కడ తేడా వచ్చినా ఫర్వాలేదు.. గుజరాత్ లో తేడా వస్తే మాత్రం కమలం పార్టీ ప్రతిష్టకు, మోడీ, షాల ఇమేజ్ కు పెద్ద మరక పడినట్టే! అయితే ఈ విషయంలో బీజేపీ స్ట్రాటజీలకు లోటు లేదు. గుజరాత్ లో గెలుపు కోసం ఆ పార్టీ రకరకాల ప్రిపరేషన్లను చేస్తూనే ఉంది. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేతను చేర్చుకుంది. ఇక గుజరాత్ లో బీజేపీ ఆధిపత్యానికి లోటు ఉండకపోవచ్చని కొన్ని సర్వేలు ఇప్పటికే చెబుతున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే మరికొంత మెరుగైన విజయాన్ని బీజేపీ సొంతం చేసుకోవచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో కాంగ్రెస్ కాస్త పోటీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లను నెగ్గగా, కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను సాధించింది. మోడీ సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ అలా ఉనికి చాటుకుంది. అయితే ఈ సారి కాంగ్రెస్ కు అన్ని సీట్లు వస్తాయా? అనేది పెద్ద సందేహం! దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆప్ హడావుడి.
ఆప్ గుజరాత్ లో సొంతంగా అధికారాన్ని పొందుతుందంటూ కేజ్రీవాల్ అంటున్నారు. అన్ని స్థానాలకూ పోటీ చేయవచ్చు ఆ పార్టీ. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ పార్టీ భారీగా చీల్చే అవకాశం ఉంది. ఆప్ అధికారానికి అవసరమైన మెజారిటీని సాధించడం సంగతెలా ఉన్నా.. భారీ ఎత్తున ఓట్లను చీల్చబోతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ కు ధీటుగానో, కాస్త తక్కువగానో ఆప్ ఓట్ల శాతాన్ని పొందే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. సీట్లు రాకపోయినా.. ఆప్ ఓట్లను చీల్చి బీజేపీ విజయాన్ని తేలిక చేయనుందనే టాక్ ఉంది.
ఆప్ బలపడే కొద్దీ.. కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆప్ ప్రస్థానాన్ని గమనిస్తే..ఏ రాష్ట్రంలో ఇతర పార్టీలను పూర్తిగా కబలించి అధికారాన్ని పొందడం లేదా నామమాత్రపు ప్రభావంతో ఓట్లను చీల్చడమే జరిగింది. మరి గుజరాత్ లో ఢిల్లీ, పంజాబ్ తరహా విజయం దక్కితే అది పెనుసంచలనం అవుతుంది. అలాగాక.. ఐదేళ్ల కిందట పంజాబ్ తరహాలో ఆప్ కొంత మేర ఓట్లను చీలిస్తే.. అది బీజేపీకే మేలు చేస్తుంది!