జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగాలు రాను రాను మరీ పక్కదారి పట్టేస్తున్నాయి. సిఎమ్ జగన్ మీద లేదా వైకాపా నాయకుల మీద బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈస్ట్ గోదావరిలో టూర్ ప్రారంభించినపుడు ముందుగా కాకినాడ ఎమ్మెల్యే మీద బురద జల్లుడు ప్రారంభించారు. నానా మాటలు విసిరారు.
అక్కడి నుంచి కదిలారు. తరువాత వైకాపా కీలక నేతల్లో ఒకరైన పెద్దిరెడ్డి మీద బురద వేయడం మొదలు పెట్టారు. ఆ అకం ముగిసింది. ఆ తరువాత ఎస్వీ సబ్బారెడ్డి మీద పడ్డారు. తిరుపతి ప్రేమెంట్ బ్రేక్ దర్శనం స్కీమ్ మీద చిత్తానికి వచ్చినట్లు ఆరోపణలు చేసారు. అది ముగిసింది.
ఇప్పుడు విశాఖ వచ్చారు. జగన్ మీద తన నోటికి వచ్చినట్లు మాట్లాడారు. జగన్ నోట్ల కట్టలు తింటావా? బంగారం ఆరగిస్తావా? లక్షల కోట్లు కావాలా? ఇలా అలా.. జనాలకు నచ్చే మాస్ డైలాగులు మాట్లాడారు. ఆపై ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద పడ్డారు. ఆయన కడుతున్న అపార్ట్ మెంట్లు అన్నీ కూల్చేస్తాము తాను అధికారంలోకి వస్తే అంటూ ప్రగల్భాలు పలికారు.
విమర్శలు చేయవచ్చు. తప్పులేదు. కానీ కనస్ట్రక్టివ్ గా వుండాలి. బురద చల్లేసి.. జనసేన శతృఘ్నికి కంటెంట్ అందించేసి, తాను మళ్లీ మంగళగిరికో హైదరాబాద్ కో చెక్కేయడం కాదు. చేసిన ఆరోపణల మీద నిల్చోవాలి. ఎంవివి అక్రమాల మీద కోర్టులో కేసులు దాఖలు చేయచ్చు కదా. లేదా ఆయన ప్రాజెక్ట్ ల మీద స్టేలు తేవచ్చు కదా? జగన్ డబ్బులు ఇలా తింటున్నాడు అని డిటైల్డ్ గా వివరించవచ్చు కదా?
జగన్ నువ్వు పారిపో, జనం మీద పడిపోతారు, ఇలా చిత్తానికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ జనాన్ని కాస్సేపు లేదా కొంత కాలం ఎంటర్ టైన్ చేయవచ్చు తప్ప, అద్భుతాలు సాధించవు. కానీ పవన్ వ్యూహం వేరు. పవన్ ను వెనుకన వుండి నడిపిస్తున్న వారి వ్యూహం వేరు. జగన్ మీద, ఆయన పార్టీ జనాల మీద అడ్డగోలు బురద జల్లాలి. ఆ పని తమ పార్టీ వారు చేస్తే దాన్ని జనం నమ్ముతారో, నమ్మరో. పవన్ లాంటి వాడి చేత ఆ పని చేయిస్తే జనంలో అనుమాన బీజాలు నాటినట్లు అవుతుంది. అదీ స్ట్రాటజీ.
ఈ పని చేయడమే లక్ష్యంగా పవన్ ప్రయాణం సాగుతోంది. భవిష్యత్ లో వైకాపా కీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు సిద్దంగా వుండడమే, పవన్ చేత బురద వేయించుకోవడానికి.