తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణి ఒకింత విచిత్రంగా తోస్తుంది.
ఆది నుంచి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సరైన విధానం కనపడదు. 2014లో ఎదురుదెబ్బ తగిలిన అనంతరం, పరిస్థితి చక్కదిద్దుకునే అవకాశం ఉన్నా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హిందూపురం విషయంలో పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ రావడం గమనార్హం. ఈ పొరపాట్లను మరింతగా కొనసాగిస్తూ ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. నియోజకవర్గంలో మరింత డ్యామేజే తప్ప సానుకూలత రాకపోవడం గమనార్హం.
2014లో హిందూపురంలో నవీన్ నిశ్చల్ బాలకృష్ణకు గట్టి పోటీనే ఇస్తారని అంతా అనుకున్నారు. కొంత వరకూ పోటీ ఇచ్చినా.. అప్పుడు టీడీపీ గాలిలో బాలకృష్ణకు మెరుగైన మెజారిటీ వచ్చింది. 2019 వరకూ నవీన్ కే అవకాశం ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ, నవీన్ ను కాదని ఇక్బాల్ ను ఇక్కడ నుంచి పోటీ చేయించడంతో మొదటికే మోసం వచ్చింది.
ఇక్బాల్ నాన్ లోకల్. తమకు టికెట్ దక్కలేదని ఒకవైపు, ఇక్బాల్ గెలిస్తే పాతుకుపోతాడనే లెక్కలతో మరోవైపు నవీన్ వర్గం ఇక్కడ సహకారం అందించి ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచిన తరుణంలో కూడా ఇక్బాల్ ఇక్కడ నుంచి నెగ్గలేకపోయారు.
మరి అక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేలుకుందా? అంటే అదీ లేదు! ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జిగా ఇక్బాల్ ఉన్నారు. పార్టీ నెగ్గగానే ఆయనకు ఎమ్మెల్సీ అవకాశమూ దక్కింది. దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సయోధ్య కుదరడం లేదు.
నవీన్ నిశ్చల్ కు కూడా జగన్ నామినేటెట్ పోస్టును ఇచ్చారు. ఆయనకు ఆ అవకాశం అయితే దక్కింది కానీ, నియోజకవర్గంలో గ్రూపుల గోల మాత్రం కొనసాగుతూ ఉంది. మరి ఇంతజేసీ ఇక్బాల్ వల్ల హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు ప్రయోజనం ఏ మాత్రం కనిపించడం లేదు. కేవలం పార్టీ గ్రూపులుగా విడిపోవడానికి తప్పిస్తే.. ఇక్బాల్ ను ఇన్ చార్జిగా కొనసాగించడంలో అర్థం ఉండదు. కానీ ఈ నియోజకవర్గం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది.
హిందూపురం తెలుగుదేశం పార్టీకి అనుకూల నియోజకవర్గమే కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిద్దుకుంటే సర్దుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ గ్రూపుల గోలను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం కానీ, ఈ నియోజకవర్గంలో పార్టీకి ఒక విధానాన్ని ఖరారు చేయడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి పెద్ద శ్రద్ధ కనిపించదు.
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇక పంచాయతీ రాజ్, ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల్లో అయితే టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది. ఈ సానుకూల పరిస్థితిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతుండటం గమనార్హం.