సాధారణంగా అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీల అధినేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప క్లారిటీగా మాట్లాడరు. ఈ కాలంలో దాదాపు అన్ని పార్టీల నాయకులది ఇదే ధోరణి. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవారు కావొచ్చు. తల పండినవారు కావొచ్చు ఇదే వైఖరి. వీరు కేవలం రాజకీయ నాయకులేగానీ రాజనీతిజ్ఞులు కాదు కదా.
ఎదుటివారిని బూతులు తిట్టడం లేదా తీవ్రంగా విమర్శించడం, తమ గొప్పలు చెప్పుకోవడం, వందిమాగధులతో భజన చేయించుకోవడం తప్ప మరో పని లేదు. ఏపీలో జగన్ పాలన అధ్వానంగా ఉందని, రాష్ట్రం శ్రీలంక టైపులో మారుతోందని, అప్పులు కుప్పలా పెరిగిపోతున్నాయని టీడీపీవాళ్ళు ప్రతిరోజూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీకి మద్దతు పలికే మీడియాది కూడా ఇదే ధోరణి.
జగన్ పరిపాలన వందశాతం బాగుందని, రాష్ట్రం సుభిక్షంగా వెలిగిపోతోందని చెప్పలేం. వైసీపీ వాళ్ళుకూడా తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతీదానికీ టీడీపీ పాలననే కారణంగా చూపిస్తున్నారు. సరే … ఇదిలా ఉంచితే రెండు రోజుల మహానాడు అద్భుతంగా, వైభవంగా జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మురిసిపోతున్నారు.
ఇక టీడీపీ నాయకుల సంగతి చెప్పనక్కరలేదు. మహానాడుకు జనం పోటెత్తిన మాట వాస్తవమే. ఆ జన్నాన్ని చూసి మురిసిపోయిన బాబు వచ్చే ఎన్నికల్లో తానే అధికారంలోకి వస్తానని గట్టిగా నమ్ముతున్నారు. కానీ అధికారంలోకి రావడానికి సభలకు జనం కుప్పలుతెప్పలుగా రావడం కొలబద్ద కాదని అనేక ఎన్నికల్లో నిరూపితమైంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తానేం చేయదలచుకున్నాడో మహానాడులో చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనగానే జగన్మోహన్ రెడ్డి క్విట్టయిపోతారా ?
మహానాడు ప్రారంభం రోజున చంద్రబాబు ప్రసంగం విన్నతర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. చంద్రబాబు క్విట్ అనగానే జగన్ ఎందుకు క్విట్టయిపోతారు? ప్రజలనుకుంటేనే జగన్ క్వట్టయిపోతారు. మరి ప్రజలు నిజంగానే జగన్ క్విట్టయిపోవాలని అనుకుంటున్నారా? జనాలంతా బలంగా అనుకుని దింపేస్తేనే కదా చంద్రబాబు కూడా అధికారం నుండి దిగిపోయింది. జగన్ను అధికారంలోనుండి దింపాలంటే చంద్రబాబు చేయాల్సిందేమిటి? ప్రజల్లో తనపై నమ్మకం కలిగించాలి. ప్రజలు చంద్రబాబును నమ్ముతారా? 2019 ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీని ఎందుకంత ఘోరంగా ఓడగొట్టారు? టీడీపీ ప్రభుత్వం అరాచకాలు, అవినీతి ఆకాశాన్ని అంటాయని జనాలు అనుకోబట్టే కదా.
పరిపాలనలో అన్నీవిధాల ఫెయిలయ్యారని అనుకోబట్టే జనాలు వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటిని అందించారు. మొత్తమ్మీద చంద్రబాబు పాలనను జగన్ పాలనను జనాలు భేరీజు వేసుకుంటున్నారు. జగన్ పాలనపై మూడేళ్ళుగా ఆరోపణలు, విమర్శలు చేస్తూ తన అనుకూల మీడియాతో బురద చల్లించేస్తున్న చంద్రబాబు తన పాలన ఏ విధంగా మెరుగ్గా ఉంటుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. తనను గెలిపిస్తే అమలుచేయబోయే కార్యక్రమాలు, పథకాలు ఏమిటని ఇప్పటివరకు చంద్రబాబు ఎక్కడా చెప్పలేకపోతున్నారు.
ప్రజలకు తాను ఏమి చేయబోతున్నారో చెప్పకుండా ఎంతసేపు ‘నువ్వు అధికారంలో నుండి దిగిపో నేను అర్జంటుగా ముఖ్యమంత్రయిపోవాల’ని గోల చేస్తే సరిపోతుందా? జనాల్లో నమ్మకం సంపాదించుకోనంతవరకు చంద్రబాబు ఎంత గొంతుచించుకున్నా, ఎన్ని మహానాడులు నిర్వహించినా ఏమాత్రం ఉపయోగముండదు. మరి చంద్రబాబును జనాలు నమ్ముతున్నారా? ప్రజల మూడ్ ఏమిటో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు.