ఒక్కో బ్యాంక్ ఖాతాలో రూ.13 కోట్లు.. కస్టమర్లు షాక్

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఖాతాదారుల ఎకౌంట్లలోని కోటి కాదు, రెండు కోట్లు కాదు.. ఏకంగా ఒక్కో ఖాతాలోకి 13 కోట్ల రూపాయలు జమ చేసింది. ఊహించని…

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఖాతాదారుల ఎకౌంట్లలోని కోటి కాదు, రెండు కోట్లు కాదు.. ఏకంగా ఒక్కో ఖాతాలోకి 13 కోట్ల రూపాయలు జమ చేసింది. ఊహించని విధంగా ఖాతాల్లో పడిన కోట్ల రూపాయల సొమ్ము చూసి ఖాతాదారాలు షాక్ అయ్యారు. అయితే ఇది బంపరాఫర్ కాదు. బ్యాంక్ చేసిన తప్పిదం.

అవును.. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు చెన్నై త్యాగరాయనగర్ బ్రాంచ్ లో ఈ తప్పు జరిగింది. ఈరోజు ఉదయం ఒకేసారి వంద మంది ఖాతాల్లోకి ఒక్కో ఎకౌంట్ లో 13 కోట్ల రూపాయల చొప్పున జమ అయ్యాయి. సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యల కారణంగానే ఇలా జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. సంబంధిత ఖాతాల్ని తాత్కాలికంగా ఫ్రీజ్ చేశారు.

ఇలాంటి ఘటనే తెలంగాణలో కూడా రిపీట్ అయింది. వికారాబద్ కు చెందిన ఓ చిరు వ్యాపారి వెంకట్ రెడ్డి ఖాతాలోకి అమాంతం 18 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి. ఇది కూడా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు నిర్వాకమే. బ్యాంక్ నుంచి తనకొచ్చిన మెసేజ్ చూసి వెంకట్ రెడ్డి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి విషయం చెప్పాడు. బ్యాంక్ సిబ్బంది అతడి ఎకౌంట్ ను ఫ్రీజ్ చేశారు.

నిన్న మధ్యాహ్నం నుంచి ఇలా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వినియోగదారులకు జరుగుతోంది. బ్యాలెన్స్ చెక్ చేస్తే కోట్ల రూపాయలు చూపిస్తోందని, ఏదైనా లావాదేవీ నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ వస్తోందని, సాయంత్రానికి ప్రాబ్లమ్ క్లియర్ అయిందని కొందరు కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కేవలం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు నుంచే ఇలా వివిధ ఖాతాల్లోకి వందల కోట్ల రూపాయలు జమ అవ్వడం చర్చనీయాంశమైంది. చెన్నై టీ-నగర్ శాఖలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు నుంచి డబ్బు వివిధ ఖాతాల్లోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ లోపం అని బ్యాంక్ చెబుతున్నప్పటికీ, సైబర్ దాడి అంశాన్ని కూడా తోసిపుచ్చలేమని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.