ఎక్కడ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే అక్కడ దీక్షే …!

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉంది. ప్రజల్లో మమేకం కావడానికి, వారికి చేరువ కావడానికి ఆమెకు దొరికిన ఆయుధం నిరుద్యోగ సమస్య. నిరుదోగుల్లో సానుభూతి సంపాదించుకోవడానికి,…

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉంది. ప్రజల్లో మమేకం కావడానికి, వారికి చేరువ కావడానికి ఆమెకు దొరికిన ఆయుధం నిరుద్యోగ సమస్య. నిరుదోగుల్లో సానుభూతి సంపాదించుకోవడానికి, వారి మద్దతు పొందడానికి ఆమె ప్రయత్నాలు చేస్తోంది. 

నిరుద్యోగులు ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నారని వార్త రాగానే షర్మిల అక్కడ వాలిపోతుంది. వెంటనే అక్కడ దీక్ష ప్రారంభిస్తోంది. సీఎం కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేస్తోంది. చెడామడా కడిగిపారేస్తోంది. నిరుద్యోగ దీక్షలు చేయడం ద్వారా తాను నాయకురాలిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది.

పైగా దీనికి ఆమె ఓ పధ్ధతి పెట్టుకుంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తానని చెప్పి ఆ ప్రకారమే ముందుకు పోతోంది. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతోంది. సీఎం కేసీఆర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ మద్య 50 వేల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానంటూ హడావుడి చేశారు. మీడియాలో మాత్రం చాలా ఆశాజనకంగా వార్తలు వచ్చాయి. మంత్రులు దీనికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. కానీ ఖాళీలు భర్తీ చేయడం అనేది ఎంతవరకు వచ్చిందో తెలియడంలేదు.

పైగా ఉద్యోగ విరమణ వయసు మూడేళ్లు పెంచుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఇదివరకే పెంచిన కేసీఆర్ తాజాగా సింగరేణి కార్మికుల, అందులోని అధికారుల, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచేశారు. 

ఇలా అన్ని డిపార్ట్ మెంటుల్లో ఉద్యోగ విరమణ వయసు పెంచుకుంటూపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి? రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచుతున్నారని షర్మిల ప్రశ్నించలేదు కదా. అలా అడిగితే అది ఆమెకు నెగెటివ్ అవుతుంది. ఇక షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు కొన్ని చోట్ల సరిగా స్పందన రావడంలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన నిరుద్యోగ దీక్ష షర్మిలను షాక్ కు గురి చేసింది. 

తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం షర్మిల చేపట్టిన నిరాహార దీక్షకు స్పందనే లేకుండాపోయింది.తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి ఆదరణ సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్రా ప్రాబల్యం, వైఎస్సార్ ప్రభావం ఉన్న ఖమ్మం జిల్లాలో అంతో, ఇంతో నెగ్గుకురావొచ్చని షర్మిల చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే పార్టీకి సంబంధించిన ప్రతీ పనికి.. ఖమ్మం జిల్లానే ఆమె ఎన్నుకుంటోంది. 

ఈ క్రమంలో ఇటీవల పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకోగా.. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు పెనుబల్లిలో నిరాహార దీక్ష నిర్వహించింది  షర్మిల. కానీ దీనికి  అసలు స్పందనే లేకుండాపోవడంతో పార్టీ నాయకులు డీలా పడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గం వైఎస్సార్ టీపీ నేతలు.. దీక్షను విజయవంతం చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు. పేరుకేమో నిరుద్యోగ నిరాహార దీక్ష కానీ.. అందులో అసలు నిరుద్యోగులే కనిపించలేదని అంతా చెప్పుకుంటున్నారు. 

నిరుద్యోగుల సంగతి పక్కనబెడితే.. పట్టుమని పది మంది కూడా వైఎస్సార్ టీపీ కార్యకర్తలు కనిపించలేదని అంటున్నారు. ఎవరికి వారు నాయకులుగా చెలామాణి అవుతూ.. దర్పం ప్రదర్శించడమే తప్ప.. అటు వైఎస్సార్ అభిమానులను కానీ , ఇటు నిరుద్యోగులను కానీ దీక్షా శిభిరానికి తరలించటంలో బొక్కాబొర్లాపడ్డారు. దీంతో దీక్ష శిబిరం అసాంతం. ఖాళీ కుర్చీలతో దర్శనం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేశారు  షర్మిల పార్టీ నాయకులు.  

కానీ అసలు సాధారణ జనమే కనిపించకపోవడం షర్మిలకు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కేవలం నిరుద్యోగ సమస్య మీదనే కాకుండా బడుగు బలహీన వర్గాల సమస్యల మీద కూడా స్పందించాలని, ఆ వర్గాల్లోనూ నాయకురాలిగా స్థానం సంపాదించుకోవాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. నేడు పోడు భూముల కోసం యాత్రకి సిద్ధమయ్యారు. బుధవారం ములుగు జిల్లాలో ఈ పర్యటన మొదలు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.