కాటికి కాళ్లు చాచిన వయసులో ఓ వృద్ధుడిలో కామవాంఛలు నిద్రలేచాయి. ఆ కోరికల మూల్యం లక్షల్లో చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంటర్నెట్ పుణ్యమా అని… ఆ వృద్ధుడు సైబర్ మోసగాళ్ల వలలో పడ్డాడు. చివరికి నష్టపోయానని లబోదిబోమంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది.
హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న 77 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపారు. ప్రేమ, డేటింగ్, చాటింగ్ అంటూ వృద్ధుడితో కబుర్లాడారు. ఇదంతా వృద్ధుడికి కొన్ని రోజులు కిక్ ఇచ్చింది. మరోసారి యవ్వనపు రోజుల్ని గుర్తు తెచ్చింది. ఈ నేపథ్యంలో వృద్ధుడి నుంచి రూ.11 లక్షలు మోసగాళ్లు వసూళ్లు చేశారు.
మరింత మొత్తాన్ని అడగడంతో తాను మోసపోయానని వృద్ధుడు గ్రహించాడు. దీంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ లబోదిబోమన్నాడు.
లేట్ వయసులో ఘాటు ప్రేమ అని నమ్మి లక్షల్లో సమర్పించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. న్యాయం చేయాలని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.