వైసీపీలో చేరికపై మాజీ ఎమ్మెల్సీ , కడప జిల్లా టీడీపీ మాజీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డి వెనక్కి తగ్గినట్టు సమాచారం. పులివెందులలో వైఎస్ కుటుంబంపై సతీష్‌రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయ పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సతీష్‌రెడ్డి పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.
గెలుపోటములతో నిమిత్తం లేకుండా టీడీపీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ వైఎస్ కుటుంబంపై ఎన్నికల రణక్షేత్రంలో సతీష్‌రెడ్డి తలపడుతూ అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికి సతీష్‌రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నమ్మిన వాళ్ల కోసం వైఎస్ కుటుంబం అండగా నిలుస్తుందని కితాబిచ్చారు. దీంతో సతీష్‌రెడ్డి వైసీపీలో చేరడం ఖరారైందని, ఇక జగన్ కండువా కప్పడం ఒక్కటే మిగిలిందనే ప్రచారం జరిగింది.
రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా…సతీష్‌రెడ్డి మాత్రం వైసీపీలో చేరకపోవడం చర్చకు దారి తీస్తోంది. మరోవైపు సతీష్‌రెడ్డి వ్యవసాయంతో పాటు ఖమ్మం జిల్లాలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారని తెలిసింది. రాజకీయాలపై మాట్లాడేందుకు ఆయన నిరాసక్తత చూపుతున్నారని సమాచారం.
వైసీపీలో తన పొజీషిన్ ఏంటనేది చెప్పక పోవడం వల్లే ఆయన పార్టీలో చేరేందుకు వెనుకాడుతున్నారని సమాచారం. మరో వైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఏ మాత్రం విలువ ఇవ్వలేదనే సమాచారం కూడా…సతీష్‌రెడ్డిని వైసీపీ వైపు అడుగులు వేసేందుకు అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తోంది.
జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని పూచిక పుల్లతో సమానంగా అధికార పార్టీ ముఖ్యనేతలు చూస్తున్నారన్న ప్రచారం కడప జిల్లాలో విస్తృతంగా సాగుతోంది. ఇందుకు అనేక ఉదాహరణలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాను వెళ్లినా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే ఆందోళన సతీష్‌రెడ్డిని వైసీపీలో చేరేందుకు నిలువరిస్తోంది. అలాగే వైసీపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందనే ప్రచారం కూడా, ఆ పార్టీలో చేరికపై సతీష్‌రెడ్డి సంశయంలో పడ్డారని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.