నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తే. ఎందుకంటే మహామహా మేధావులు చేయలేని పని రఘురామకృష్ణరాజు చేస్తున్నారని చెప్పాలి. ఆయన మొండి ధైర్యం, జగన్‌కు విసిరే సవాల్… చివరికి చంద్రబాబును ఇరికిస్తున్నాయనే అభిప్రాయాలు టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత కాలంలో దేన్నీ దాచిపెట్ట లేని పరిస్థితి. అందుకే చంద్రబాబు,లోకేశ్, రఘురామకృష్ణరాజు మధ్య సాగిన వాట్సాప్ సంభాషణ, చాటింగ్ బాగోతం యథా తథంగా ప్రజలకు తెలిసొచ్చింది.
సోషల్ మీడియా విస్తృతమైన పరిస్థితుల్లో ఎవరి వెనుక ఎవరున్నారు? ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఇట్టే తెలిసిపోతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని సీఐడీ విచారణలో తేలిపోయింది. ఈ నేపథ్యంలో తమ మధ్య సాగిన రాజకీయ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు కుండబద్దలు కొట్టారు.
ఎంతో ధైర్యం, తెగువ, ప్రత్యర్థులంటే లెక్కలేని తనం ఉంటే తప్ప …రఘురామ లాగా సీఐడీ దాఖలు చేసిన అఫిడవిట్ వాస్తవమే అని పరోక్షంగానైనా అంగీకరించలేరు. ఎవరికీ లేని ఎన్నో ప్రత్యేక లక్షణాలున్న రఘురామను తప్పక అభినందించాల్సిందే. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు సీఐడీ సమర్పించిన అఫిడవిట్‌పై తనదైన స్టైల్‌లో స్పందించారు. అంతేకాదు, “ఔను చంద్రబాబు, లోకేశ్‌తో మాట్లాడాను, ఏం చేస్తారో చేసుకోండి” అనే రేంజ్‌లో రఘురామ సవాల్ విసిరారు.
“మీరు ఎన్ని కల్పిత వాట్సప్ ఛాట్‌లు సృష్టించినా వాటికి ఎలాంటిటి విశ్వసనీయత లేదు. మీ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని నేను పిటిషన్ వేశా. నేను వెయ్యి మందికి మెసేజ్ పంపా. అందులో మాజీ ముఖ్యమంత్రికి వెళ్లి ఉండవచ్చు. నేను ఎవరికైనా మెసేజ్‌లు పంపొచ్చు. మీకు ఎలా ఆ సమాచారం వచ్చింది” అని ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ అంశంపై 2021 మార్చి 28, 29, ఏప్రిల్ 2, 3, 4వ తేదీలలో చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు వాట్సాప్ చాటింగ్ చేశారని సీఐడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కాపీని చంద్రబాబుకు రెండు సార్లు వాట్సాప్ చేసినట్టు సీఐడీ తేల్చిన సంగతి తెలిసిందే. పిటిషన్ కాపీని చంద్రబాబు ఓకే చేసిన తర్వాతే 2021 ఏప్రిల్ 6న న్యాయస్థానంలో దాఖలు చేసినట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఐడీ స్పష్టంగా వివరించింది.
పాపం రఘురామ అంత ధైర్యం చంద్రబాబుకు లేకపోయింది. అందుకే ఆయనేమీ మాట్లాడకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు తరపున వకల్తా పుచ్చుకున్నట్టు రఘురామే అన్నీ మాట్లాడేస్తున్నారు. రఘురామ ధైర్యం, తెగింపు, మొండితనం మున్ముందు ఇంకా అనేక నిజాలు మాట్లాడేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నట్టు రహస్యం గుట్టు రట్టు కావడం వల్ల రఘురామకు కలిగే నష్టం ఏమీ లేదు.
భవిష్యత్‌లో తనకు జరిగే నష్టం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే రఘురామ నుంచి ఇలాంటి నిజాలు మరెన్నో రావాలని వైసీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. జగన్ రుణాన్ని రఘురామ ఆ విధంగా తీర్చుకుంటున్నారన్న మాట!