చంద్రబాబు & తెలుగుదేశం ఎప్పటికీ కౌరవ వారసులే !! అవే కుట్రలు.. అవే ఆలోచనలు.. అవే పద్దతులు.. జనం తో పని లేదు .
మహాభారతంలో కౌరవుల పతనం స్వయంకృతాపరాధం వల్లనే జరిగింది. నిరంతరం పాండవులను ప్రత్యర్థులుగా తలచి వారి పతనాన్ని ఆశించి కుట్రలు చేయడంతోనే కౌరవుల సమయం అంతా గడిచింది. కౌరవుల మాయాజూదం, పాండవుల వనవాసం, తర్వాత అజ్ఞాతవాసం, ఆపైన అంతిమంగా మహాభారత యుద్ధం. మహాభారతం మొత్తం ఇదే క్రమం. ఈ క్రమంలో కౌరవులు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ తమకోసం తాము ఏదీ చేసినట్టు కనిపించరు. వారి పూర్తిసమయం ప్రత్యర్థులపై కుట్రలకే కేటాయించారు.
బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, దుర్యోధన పట్టాభిషేకం తర్వాత కానీ, అంతిమంగా మహాభారత యుద్ధంలో కానీ ఎప్పుడూ తమకోసం కౌరవులు ఏపనీ చేయలేదు. ప్రత్యర్థుల పతనానికే నిరంతరం ఆలోచన చేసేవారు.
దుర్యోధనుడికి లభించిన దేహదారుడ్యం కూడా స్వయంగా వచ్చింది కాదు. తల్లి గాంధారీ స్పర్శతో లభించింది. వాస్తవానికి దుర్యోధనుడి దేహదారుడ్యం (వజ్రశరీరం), కర్ణుడి కవచకుండలాలకు ఏమాత్రం సరితూగదు. అయినా అదికూడా భీముడి సహజ దేహదారుడ్యంని చూసి కలతచెందిన గాంధారి కొడుకుపై ప్రేమతో ఇచ్చిన బలమే.
చంద్రబాబు కూడా అంతే. ఇదంతా ఆయనకు స్వయంగా వచ్చిన బలం కాదు. ఎన్టీఆర్ ఇచ్చిన బహుమతి. ఎన్టీఆర్ ప్రారంభించి అధికారంలోకి తెచ్చిన టీడీపీ చంద్రబాబుకు వజ్రశరీరంలా కలిసొచ్చింది. ద్రోణాచార్యుని దగ్గర విద్యాభ్యాసంలో కూడా కౌరవులు తమకేం విద్య కావాలో కౌరవులు గురువును అడిగి నేర్చుకున్నది లేదు. వారి ద్రుష్టి అంతా అర్జునిడి విలువిద్యా నైపుణ్యం, భీముడి మల్లయుద్ధ నైపుణ్యంపైనే ఉంది. ప్రత్యర్థుల శక్తులను పరిశీలించడం, వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో ఆలోచించడం… నిరంతరం ఇవే ఆలోచనలు. అందుకే కర్ణుడు కనిపించగానే వెనుకా, ముందూ ఆలోచించకుండా అర్ధరాజ్యం ఇచ్చి అంగరాజును చేశాడు దుర్యోధనుడు.
టీడీపి అధినేత చంద్రబాబు కూడా నిరంతరం ఇలాంటి ఆలోచనలే చేస్తుంటారు. ఎన్నికల్లో తన అభ్యర్థులు ఎవరు, వారి శక్తియుక్తులు, సామర్ధ్యాలు ఏంటి అని ఎప్పుడూ ఆలోచించరు. ప్రత్యర్థులెవరు, వారికి ధీటైన వారెవరు అనే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అప్పట్లో కాంగ్రెస్ కానీ, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కానీ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే చంద్రబాబు తన అభ్యర్థులను ప్రకటిస్తారు.
ప్రతి చోట తనకో కర్ణుడు కావాలి. తన దగ్గర అర్జునుడు లాంటి సమర్ధుడు ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. దుర్యోధనుడు కూడా అంతే. అలా కోరుకుని ఉంటే అర్జునుడు లాంటి విలువిద్యాకారుడు, భీముడి లాంటి మల్లయోధుడు తన నూర్గురు సోదరుల్లో తయారయ్యేవారు. ఎక్కడో విద్యాభ్యాసం చేసిన కర్ణుడు అవసరం ఉండేది కాదు. చంద్రబాబు కూడా అంతే. ఏ పార్టీలోనో గెలిచినవారిని తన ఖాతాలో వేసుకుంటారు.
ఇతర పార్టీల్లో విజయం సాధించినవారిని తన పార్టీలో చేర్చుకుంటారు. తను తన సేనలో వీరుణ్ణి తయారుచేయడం కాక, ప్రత్యర్థి సేనలో వీరుల్ని ఒప్పించో, మెప్పించో, నొప్పించో తన ఖాతాలో వేసుకుంటారు. అందుకే ముప్పయ్యేళ్ళు అయినా ఆ పార్టీలో చంద్రబాబు తర్వాత ఓ బలమైన నేత తయారవ్వలేదు. ఒకవేళ ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, హరికృష్ణ వంటి బలమైన నేతలు ఉన్నా, దేవేందర్ గౌడ్ వంటి వ్యూహకర్తలు ఉన్నా, వారి కథ ఆకస్మీకంగానే ముగుస్తుంది లేదా వారు చంద్రబాబు నుండి దూరంగా వెళ్ళిపోవాల్సిందే.
ఇక పొత్తుల విషయంలోనూ, అవకాశావాదంలోనూ కౌరవులతో చంద్రబాబుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అవసరానికి అనుగుణంగా, అనుకూలంగా ఎలాంటి పొత్తులకోసం అయినా చంద్రబాబు వెనుకాడడు. గయోపాఖ్యానంలో శ్రీకృష్ణార్జున యుద్ధం ఒక కీలక ఘట్టం. మహాభారత యుద్ధానికి ముందు జరిగే సంఘటన. గయుడు అనే గంధర్వుడి కారణంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు యుద్ధానికి తలపడినప్పుడు కౌరవులు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అర్జునుడికి మద్దతు పలికే ప్రయత్నం చేస్తారు.
కౌరవుల నిరంతర పోరాటం పాండవులతోనే అయినా ఈ యుద్ధంలో ఆ పాండవులకు మద్దతు పలికే ప్రయత్నం చేస్తారు. చివరికి పాండవులు తిరస్కరిస్తే తిరిగి బలరాముణ్ణి కలిసి కృష్ణుడికి మద్దతు పలుకుతారు. బలరామకృష్ణులు కూడా దుర్యోధనుడి మద్దతు తిరస్కరించడంతో కౌరవులు భంగపడతారు.
చంద్రబాబు కూడా అంతే. ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటివారితో అయినా పొత్తులు పెట్టుకున్నారు. కమ్యూనిస్టులు, బీజేపీ, చివరికి కాంగ్రెస్. ఇలా ఏ పార్టీతో అయినా పొత్తుకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. కమ్యూనిస్టులతో పొత్తుతో మొదలైన ఆయన రాజకీయం, బీజేపీతో కొనసాగి చివరికి కాంగ్రెస్ తో పొత్తుతో ముగిసిపోబోతోంది.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు, తెరాసతో పొత్తులు పెట్టుకున్నారు. తర్వాత జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బీజేపీతో పొత్తు ఆ తర్వాత కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం. అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు కుదుర్చుకోవడంలో కౌరవుల్లాగానే చంద్రబాబు సిద్ధహస్తుడు. చివరికి రాయభారం విఫలం అయి, మహాభారత యుద్ధం ఖరారు అయిన తర్వాత కూడా ఈ పొత్తుల కుట్రలు కౌరవులు ఆపలేదు.
చివరి నిమిషంలో చిరకాల శత్రువు అనుకున్న కృష్ణుడితో జట్టు కట్టేందుకు కౌరవులు వెనుకాడరు. మొత్తంగా కృష్ణుడి సైన్యాన్ని తమవైపు తీసుకుంటారు. చంద్రబాబు కూడా ఇలాగే పొత్తుల జిత్తులు వేస్తూనే ఉంటారు. 2014 ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నుండి అభ్యర్థుల్ని అరువుతెచ్చుకున్న సంగతి కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని తెచ్చుకున్న సందర్భంతో పోల్చుకోవచ్చు.
ఇవన్నీ స్వయంకృతాలే. ఇవన్నీ కౌరవుల ఓటమికి కారణాలే. అలాగే చంద్రబాబు ఓటమికి, చంద్రబాబు పతనానికి, మొత్తంగా చంద్రబాబును నమ్ముకున్న సామాజికవర్గానికి పతనానికి సూచికాలే. దుర్యోధనుడి ఎత్తులు, పొత్తులు, జిత్తులు నమ్మి మొత్తం కౌరవసైన్యం ఎలా నష్టపోయిందో, చంద్రబాబు ఎత్తులు, పొత్తులు, జిత్తులు, అవకాశవాద రాజకీయాలు నమ్మి ఆ సామాజికవర్గం నష్టపోయింది.
ఇక దుర్యోధనుడికి తన పుత్రరత్నం లక్ష్మణ కుమారుడు అంటే విపరీతమైన ప్రేమ. అయితే దుర్యోధనుడు ఎంతటి మల్ల యోధుడో, ఎంతటి కుట్రదారుడో ఆయన కొడుకు అంతటి అసమర్ధుడు, పిరికివాడునూ. అయితే తన కుమారుడు పిరికివాడు అని కానీ, అసమర్ధుడు అని కానీ ప్రజలకు తెలియకుండా వ్యూహాలు రచించి కూర్చుంటాడు. లక్ష్మణకుమారుడి గొప్పలు చెప్పేందుకు భజంత్రిలను ఏర్పాటు చేస్తాడు. ఇక శకుని పక్కనే ఉన్నాడు. లక్ష్మణ కుమారుడి గొప్పలు శకుని నిరంతరం కీర్తిస్తూనే ఉంటాడు.
చంద్రబాబు కూడా అంతే. ఆయన పుత్రరత్నం లోకేష్ అభినవ లక్ష్మణ కుమారుడే. ఆయన గొప్పతనం, సమర్ధత గురించి గొప్పగా ప్రచారం చేసేందుకు చుట్టూ భజంత్రీలు ఉన్నారు. లోకేష్ వీరత్వం, సమర్థత, వాక్చాతుర్యం, సాహసం … ఇలా గొప్పతనం అంతా ఈ భజన బృందం ప్రచారం చేస్తూనేఉంటుంది.
దుర్యోధనుడు పుత్రవాత్సల్యంతో లక్ష్మణ కుమారుణ్ణి దుర్యోధనుడు యువరాజును చేసినట్టే చంద్రబాబు తన పుత్రరత్నం లోకేష్ ను మంత్రిని చేశారు. అంతకు మించి వారు సాధించగలిగిందేమి లేదు. చంద్రబాబు & తెలుగుదేశం ఎప్పటికీ కౌరవ వారసులే !! అవే కుట్రలు.. అవే ఆలోచనలు.. అవే పద్దతులు.. జనం తో పని లేదు .
Note : కౌరవులు కూడా ఇలానే ప్రతి చోట వెన్నుపోట్లు లేదా తమ covert లను ప్రవేశపెట్టి పనులు చేయించుకోవడం మొదటి నుండి ఉన్న విధ్యే … అదే చంద్రబాబు నిత్యం చేస్తుంటారు. అవసరం కోసం & అధికారం కోసం ఎంతకైనా దిగజారే ధూర్యోధనుడి బుద్దులే చంద్రబాబు కి స్పష్టంగా వచ్చాయి… ఇవే కాదు అనేకమైన ఆలోచనలు, పోలికలు, నిజాలు అప్పటి కౌరవులతో ఇప్పటి తెలుగుదేశం & చంద్రబాబు కి సరిపోతాయి…
Last but real … అక్కడ లక్ష్మణ కుమారుడే … ఇక్కడ లోకేశ్ !! లోకేశ్ శక్తి యుక్తులు తెలుగుదేశం శ్రేణులందరికీ తెలుసు.. అయినా తప్పక మోస్తున్నారు.. సొంతబలం మీద గెలవడం చేతగాక అప్పటి కౌరవులు ఇతరుల బలం మీద మాత్రమే గెలివాడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అంతే ..