జడ్జిలకు వ్యక్తిగత ఉద్దేశాలను ఆపాదించడం.. ఈ మధ్యకాలంలో బాగా చర్చనీయాంశం అవుతున్న అంశం. దీనిపై స్వయంగా కోర్టులే స్పందిస్తున్నారు. తమకు వ్యక్తిగత ఉద్దేశాలను ఆపాదిస్తే సహించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాయి న్యాయస్థానాలు.
ఏపీలో ఆ మధ్య కొందరు అధికార పార్టీ నేతలకు కూడా నోటీసులు జారీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనంగా మారింది.
ఎంపీ రఘురామకృష్ణంరాజు, తెలుగుదేశం నేత లోకేష్ ల మధ్యన జరిగిన వాట్సాప్ సంభాషణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో న్యాయమూర్తులను ఉద్దేశించి లోకేష్ ఉపయోగించిన భాష అనుచితంగా ఉంది. అంతే కాదు.. ఏకంగా హై కోర్టు న్యాయమూర్తులనే పంపించేయాలి.. అన్నట్టుగా లోకేష్ వ్యాఖ్యానించినట్టుగా అఫిడవిట్ లో పేర్కొన్న వైనం ఆశ్చర్యకరంగా ఉంది.
ఇంతకీ జడ్జిల విషయంలో లోకేష్ కు ఉన్న ఉద్దేశం ఏమిటి? వాళ్లను పంపించేయాలి అనడం వెనుక మర్మం ఏమిటో మరి! అలాగే ఒక జడ్జికి ప్రాంతాన్ని, కులాన్ని ఆపాదిస్తూ కూడా లోకేష్ స్పందించినట్టుగా ప్రభుత్వ అఫిడవిట్ లో పేర్కొన్నారట.
ఆ మధ్య చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కులాలను అంటగడతారా? అంటూ ఒక రేంజ్ లో స్పీచులిచ్చారు. చంద్రబాబు ఊకదంపుడు స్పీచ్ లు అలా ఉంటే..ఆయన తనయుడు ఒక న్యాయమూర్తి పట్టుకుని కులంతో పాటు ప్రాంత ద్వేషాన్ని వ్యక్తీకరించారు. మరి చంద్రబాబు చెప్పే నీతులు ఆయన తనయుడికి వర్తించవు కాబోలు!
అలాగే ఒక రాజకీయ పార్టీ అధినేత తనయుడు ఇలా జడ్జిలను పంపించేయాలి అని వ్యాఖ్యానించడం కూడా తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదేమో. మరి ఈ అఫిడవిట్ ను ఏపీ ప్రభుత్వం డైరెక్టుగా సుప్రీం కోర్టుకే సమర్పించింది కాబట్టి, దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తిదాయకంగా మారింది.