న్యాయ దేవత సాక్షిగా జగన్ నిజాయతీ ఏంటో జనానికి తెలిసొస్తోంది. జగన్ వ్యవహారాలతో విభేదించే వాళ్లు సైతం ఆయన ముక్కుసూటితనాన్ని గౌరవిస్తారు. ఏదైనా నేరుగా చేయడమే తప్ప …కుట్రలు, కుతుంత్రాలు జగన్ డిక్షనరీలోనే లేవు. ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఒక్క జగన్‌ను ఎదుర్కోడానికి ఇంతగా దిగజారి కుట్రలకు పాల్పడలా అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ప్రధానంగా కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు జగన్ లేఖ రాయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో రఘురామతో పాటు నారా లోకేశ్ కొందరు జడ్జిలపై ప్రయోగించిన అభ్యంతరకర భాషను ప్రస్తావిస్తూ… ఇంతకూ న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నదెవరని నిలదీస్తున్నారు.
గతంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పులు రావడం వెనుక అనుమానాలను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖను ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం మీడియాకు విడుదల చేయడం తీవ్ర దుమారం రేపింది.
ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కొందరు న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించారు. న్యాయ వ్యవస్థలోని కొందరు వ్యక్తులపై తన మనసులో మాటను నేరుగా సర్వోన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారే తప్ప, వాట్సాప్ సంభాషణల్లోనూ, చాటింగ్‌లోనూ వెల్లడించలేదు. జగన్ చేసిన పనిలో ఎక్కడా గోప్యత లేదు.
కానీ న్యాయ వ్యవస్థపై అపార గౌరవం, మర్యాదలున్నాయని పదేపదే సూక్తులు చెప్పే రఘురామ, నారా లోకేశ్ చేసిందేమిటి? ప్రవీణ్ కుమార్ అనే న్యాయమూర్తికి కులం, ప్రాంతం అంటగట్టడం బయటపడింది. అలాగే ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీవ్ర అభ్యంతరకర భాషలో ‘చీఫ్ ఫెలో ’ అని వ్యాఖ్యానించడం ఏంటి? ప్రవీణ్‌కుమార్ అనే న్యాయమూర్తిని పంపించేయాలనడం న్యాయ వ్యవస్థను గౌరవించడంలో భాగంగా అర్థం చేసుకోవాలా?
ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి ‘చీఫ్’ ఆఫ్ ఏపీ కాస్త పిరికివాడిలా కనిపిస్తున్నాడనే చర్చ నడిచింది. స్టుపిడ్ ప్రవీణ్ అని ఓ న్యాయ మూర్తిని కామెంట్ చేయడం ఎంత బరితెగింపు? ఇలా జగన్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. అసలు వాళ్లతో జగన్‌ను పోల్చడం కూడా అన్యాయమే అవుతుంది. జగన్ ఏ రోజూ ఇలా చిల్లరగా వ్యవహరించలేదు. తన వ్యతిరేకతను, అభిప్రాయాలను బహిరంగం గానే వ్యక్తపరిచారు. ఇదే లోకేశ్, రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే… న్యాయ వ్యవస్థ అంటే భయభక్తులు ప్రదర్శిస్తూ, మనసులో మాత్రం అసహ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టు సీఐడీ అఫిడవిట్ తేల్చి చెప్పింది.
న్యాయ వ్యవస్థపై లోకేశ్, రఘురామకృష్ణరాజు కామెంట్స్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజాయతీ ఏంటో లోకానికి బాగా కళ్లకు కట్టింది. గతంలో కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు జడ్జిలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరిని సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. మరి ఎంపీ రఘురామ, మాజీ మంత్రి లోకేశ్ చేసిన దూషణలపై ఎలాంటి విచారణ జరపాలి? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.
ఇప్పుడు ఏపీ సమాజం ముందు రెండు దృశ్యాలున్నాయి. ఒకటేమో పలువురు జడ్జిల వ్యవహార శైలిపై సీఎం జగన్ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. రెండోది వాట్సాప్ చాటింగ్‌లో న్యాయమూర్తులపై నారా లోకేశ్, రఘురామ కృష్ణరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు. వీరిలో న్యాయ వ్యవస్థపై నిజంగా ఎవరికి గౌరవం ఉందో ప్రజాకోర్టులో తీర్పు చెప్పాల్సి ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఏమో అనుకున్నాం. అది ఇప్పుడు నిజమవుతోంది.