రైతు భరోసా: జగన్ ఫార్ములానే కరెక్ట్

రైతు భరోసా పేరుతో ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అటు పీఎం కిసాన్ పేరుతో కేంద్రం కూడా రైతులకు సాయం చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జాబితాను మాత్రం…

రైతు భరోసా పేరుతో ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అటు పీఎం కిసాన్ పేరుతో కేంద్రం కూడా రైతులకు సాయం చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జాబితాను మాత్రం కేంద్రం పట్టించుకోకపోవడం విశేషం. పీఎం కిసాన్ పేరుతో జగన్ ప్రచారం పొందుతున్నారనేది వారి అనుమానం. అందుకే నేరుగా రైతుల అకౌంట్లలో కేంద్రం డబ్బులు జమ చేస్తోంది. రాష్ట్రంలోని రైతు భరోసాతో సంబంధం లేకుండా ఈ డబ్బులు పడుతున్నాయి.

అయితే ఇప్పుడీ పీఎం-కిసాన్ పథకంలో రూ.3వేల కోట్లు దుర్వినియోగం అవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. లబ్ధిదారుల ఎంపికలో కేంద్రం బోల్తా పడటం, కొంతమంది చేతివాటం కేంద్రానికి తిప్పలు తెచ్చిపెట్టాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ లో సెలవివ్వడం విశేషం.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, సింపుల్ గా 'పీఎం-కిసాన్' అనే పేరుతో ప్రతి ఏటా మూడు విడతల్లో కేంద్రం ప్రభుత్వం రైతుల ఖాతాలో 6వేల రూపాయలు జమ చేస్తుంది. కేవలం పొలం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ క్రమంలో పొలం ఉన్న రిచ్ రైతులు కూడా పీఎం-కిసాన్ సాయం పొందుతున్నారు. కోటీశ్వరులు, లక్షల్లో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండటం విశేషం. ఇలా 42లక్షమంది అనర్హులకు కేంద్రం 3వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేసింది. ఇప్పుడీ సొమ్మునంతా రికవరీ చేస్తానంటూ బీరాలు పలుకుతోంది.

మిగతా రాష్ట్రాల సంగతి పక్కనపెడితే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతుల లిస్ట్ ని ఫాలో అయి ఉంటే కేంద్రానికి ఈ తిప్పలు తప్పేవి. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి రైతు భరోసా సాయం అందిస్తోంది. పొలం ఉన్న యజమానులకే కాదు, కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తోంది. దీని కోసం ఈకేవైసీ చేయించడం, కౌలు పత్రాలు సిద్ధం చేయించడం, అన్నీ పక్కాగా జరిగాయి.

అయితే ఈ లిస్ట్ ని కేంద్రం పక్కనపెట్టింది. కేంద్రం డబ్బులిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పేరొస్తుందనేది వారి వాదన. అందుకే రైతు భరోసాకి పీఎం-కిసాన్ అనే తోక కూడా తగిలించారు. రైతు భరోసా నిధులు విడుదల చేసే సమయంలో కేంద్రం కూడా డబ్బులిస్తే రైతులకు మరింత ఉపయోగం అనే ప్రతిపాదన ఉన్నా కూడా దాన్ని పక్కనపెట్టి వేరుగా నిధులు విడుదల చేస్తోంది కేంద్రం.

అంతవరకు ఓకే.. కనీసం రాష్ట్రం ఇచ్చిన లిస్ట్ కూడా పట్టించుకోకపోతే ఎలా..? ఇప్పుడిలా 3వేల కోట్లు వృథా చేసి తమాషా చూస్తున్నారు కేంద్రం పెద్దలు. బూడిదలో పోసిన పన్నీరుని తిరిగి తీసుకుంటామని లాజిక్ లు చెబుతున్నారు.

ఇటీవల పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యంలో కూడా కేంద్రం ఇలాగే పంతాలకు పోయింది. ఇంటింటికీ సరుకులిచ్చే రేషన్ వాహనాలపై జగన్ బొమ్మ ఉంటుందని, కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యానికి జగన్ కి ప్రచారం జరుగుతుందనే నీఛ బుద్దితో.. నెల మధ్యలో ఉచిత బియ్యం పంపిణీ చేయడం మొదలు పెట్టింది. నేరుగా రేషన్ దుకాణాల వద్దే ఈ బియ్యం ఇస్తామంటోంది. ఇలాంటి సంకుచిత మనస్తత్వంతోనే కేంద్రం లేనిపోని తిప్పలు తెచ్చుకుంటోంది.