టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు మాట్లాడేందుకు సబ్జెక్ట్ దొరకడం లేదు. దీంతో ఆయన ఏడాది నాటి సంగతులను మళ్లీ గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడుతున్నారు. దీంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. వర్తమానం, భవిష్యత్‌ను వదిలేసి… గతంలోకి ఎందుకు వెళ్తున్నావ్ లోకేశ్ అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
కేవలం జగన్ ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలనే ఉత్సాహం తప్ప, పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో లోకేశ్‌లో కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చీరాలలో ఏడాది క్రితం మాస్క్ పెట్టుకోలేదని కిరణ్‌కుమార్ అనే యువకుడిని పోలీసులు కొట్టి చంపారంటూ లోకేశ్ తాజాగా గుర్తు చేసుకోవడం గమనార్హం. దళితులంటే సీఎం జగన్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని ఆయన ప్రశ్నించారు.
మాస్క్ పెట్టుకోకపోవడమే నేరమైతే.. రోజూ మాస్క్ పెట్టుకోని జగన్‌రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు? అని లోకేశ్ ప్రశ్నించారు. కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మరి బాధిత కుటుంబానికి టీడీపీ తరపున చేసిన సాయం ఏంటో చెబితే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి పదేపదే దళితులను పావుగా వాడుకోవడం టీడీపీ నేతలకే చెల్లిందనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో బాధితుల వద్దకెళ్లి పరామర్శించి వారి కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనే లోకేశ్‌లో కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.