త్రిశంకు స్వర్గంలో సినిమా థియేటర్లు

కరోనా ఫస్ట్ వేవ్ అన్ లాక్ ప్రక్రియలో అప్పట్లో థియేటర్లు తెరిచిన వెంటనే జనం ఎగబడి సినిమాలకు వెళ్లారు. పాత సినిమాలు కూడా రీ రిలీజ్ లతో ఆకట్టుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో చాలా…

కరోనా ఫస్ట్ వేవ్ అన్ లాక్ ప్రక్రియలో అప్పట్లో థియేటర్లు తెరిచిన వెంటనే జనం ఎగబడి సినిమాలకు వెళ్లారు. పాత సినిమాలు కూడా రీ రిలీజ్ లతో ఆకట్టుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో చాలా వరకు ప్రయోజనం కనిపించింది. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ తర్వాత వచ్చిన సినిమాలు చాలావరకు సేఫ్ అయ్యాయి. అయితే సెకండ్ వేవ్ తర్వాత జనాలు బాగా మారిపోయారు. థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా పెద్దగా ఫలితం కనిపించడంలేదు. కన్నడ సినీ ఇండస్ట్రీ పరిస్థితే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

కర్నాటకలో థియేటర్లు తెరుచుకునేందుకు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కర్నాటకలో మొత్తం 630 సింగిల్ స్క్రీన్ లు ఉండగా, 260 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే వీటిలో తొలిరోజు కేవలం 10శాతం మాత్రమే తెరుచుకున్నాయి. ఆ థియేటర్లు కూడా ప్రేక్షకులు లేకపోయే సరికి సాయంత్రానికి మూతబడ్డాయి.

మరోవైపు ఈ షాక్ తో మిగతా థియేటర్ల యాజమాన్యాలు కూడా వాటిని తిరిగి ప్రారంభించేందుకు జంకుతున్నాయి. రిపేర్ వర్కులంటూ కాలం గడుపుతున్నాయి. పాత సినిమాలు వేయడానికైనా, జనాల్ని థియేటర్లకు అలవాటు చేసేందుకైనా మొదట్లో సినిమా హాళ్ల ఓనర్లు రిస్క్ చేయక తప్పదు. ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో కష్టమే అయినా గతంలో అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఈసారి జనాదరణ అస్సలు లేకపోవడం మాత్రం విచిత్రం.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి..?

తెలంగాణలో ఈనెల 23 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు సింగిల్ స్క్రీన్స్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే జనాల మూడ్ మాత్రం ఇంకా మారలేదని అర్థమవుతోంది. అందుకే నారప్పలాంటి సినిమాలు థియేటర్లను నమ్ముకోకుండా ఓటీటీలోకి వచ్చేశాయి. 

మూడో వేవ్ ముప్పు ఉందనే భయాలతో చాలామంది నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటించినా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మంచి ఆఫర్లు వస్తే ఓటీటీలకు కట్టబెట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఇక ఏపీలో మాత్రం ఇంకా సినిమాహాళ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఇటీవల టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. దీంతో ఏపీలో ఇప్పుడున్న రేట్లకి సినిమా హాళ్లు తెరవడం ఏమాత్రం సాధ్యం కాదని తేల్చి చేప్పేశారు నిర్మాత సురేష్ బాబు. కొత్త సినిమాలు క్యూ కడితే మాత్రం థియేటర్లకు కళ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు మాత్రం థియేటర్ల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉంది. తెరిస్తే ఓ బాధ, తెరవకపోతే ఇంకో బాధ.