టైటిల్: రంగ రంగ వైభవంగా
రేటింగ్: 2/5
తారాగణం: వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, ప్రభు, నరేష్, సత్య, సుబ్బరాజు, ఆలి తదితరులు
కెమెరా: శాందత్
ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
దర్శకత్వం: గిరీశాయ
విడుదల తేదీ: 2 సెప్టెంబర్ 2022
ఆల్రెడీ “కొండపొలం” తో ఒక ఫ్లాపులో కనిపించినా ఇంకా “ఉప్పెన” హీరోగా వైష్ణవ్ తేజ్ కి ఇంకా గుర్తింపు ఉంది. “రొమాంటిక్” లో హీరోయిన్ గా కనిపించిన కేతిక శర్మకి యువ ప్రేక్షకుల్లో కాస్త ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరూ ఈ సినిమాతో తెరమీదికొచ్చారు.
విషయమేంటంటే…రెండు ఫ్యామిలీలు పక్కపక్క ఇళ్లల్లో కలిసి మెలిసి ఉంటాయి. వాళ్ల మధ్యలో ఒక కారణం వల్ల గొడవొస్తుంది. నాటకీయంగా చివరికి కలుస్తారు. కథగా చెప్పుకోవాలంటే ఇంతే.
తప్పు లేదు. సినిమాకి కథ ఇలా ఉండాలి, ఇంతుండాలి అని నియమాలేవీ ఉండవు. అంతా ట్రీట్మెంట్ లోనూ, కథనంలోని స్టైలింగ్ లోనూ, సీన్ కన్సీవింగ్ లోనూ ఉంటుందంతే.
ఎప్పుడో 1970ల్లో వచ్చిన “మీనా” సినిమాని యథాతథంగా రీబూటింగ్ చేసి “అ ఆ” పేరుతో తెరకెక్కించి హిట్టు కొట్టిన త్రివిక్రమ్ మన మధ్యనే ఉన్నాడు. అలాగే 1960ల నాటి “ఇంటిగుట్టు” తీసుకుని కాస్త మార్చి “అల వైకుంఠపురంలో” తీసి బ్లాక్ బస్టర్ కొట్టింది కూడా త్రివిక్రమే. పాత కథనే తీసుకున్నా కొత్తగా మార్చడమనేది ఒక ఆర్ట్.
అలాంటిది..ఈ దర్శకుడు మాత్రం 2022లో 1990 ల కాలం నాటి సినిమా తీసాడు. 1996లో వచ్చిన “నిన్నే పెళ్ళాడతా” పోస్టర్ తో కథ మొదలైతే ఏమో అనుకుంటాం. కానీ దర్శకుడి బ్రెయిన్ ఆ కాలంలోనే ఆగిపోయిందని కాసేపు చూస్తే అర్థమవుతుంది.
ప్రతి హీరో మీద ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలాగ, కుదిరితే ఆ పై స్థాయిలో ఉండేలాగ కథనం నడపగలగలిగితే దర్శకుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడని అనొచ్చు.
ఒక మెగా ఫ్యామిలీ హీరోని పెట్టుకుని ఎప్పుడో పాతికేళ్ల క్రితం నాటి సెన్సిబిలిటీస్ తో సినిమా తీయడమంటే దర్శకుడి ఊహాశక్తిలో వెనకబాటుతనానికి, నిర్మాత అవగాహనారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఏ మాత్రం ట్విస్టుల్లేని కథనం, బలవంతమైన పాత్రలు, నవ్వురాని కామెడీ, రెండున్నర దశాబ్దాల కాలం నాటి కథనం, పేలవమైన సీన్ కన్సీవింగ్ ప్రేక్షకుల్ని ఎడారిలో నడిపిస్తున్నట్టు నడిపిస్తాయి. మధ్యలో ఒయాసిస్సుల్లా ఉన్నవి మాత్రం పాటలే. సంగీత పరంగా, సాహిత్యపరంగా చెవులకి ప్రశాంతంగా తాకుతాయి.
మళ్లీ నేపధ్య సంగీతం విషయానికొస్తే అసలిది దేవీశ్రీ ప్రసాద్ పనేనా అనిపించేంత చప్పగా ఉంది. సీన్ డల్ గా ఉంటే నేపథ్య సంగీతం పైకి లేపాలి. ఆ పని ఏ మాత్రం జరగలేదు. బహుశా ఆ సీన్స్ చూసి సంగీతానికే నీరసమొచ్చిందేమో.
కేతికాశర్మ మాత్రం ఒక పాటలో శృంగారకేతనం ఎగరేసింది. ఆమె వరకు తెర మీద అందంగా కనిపించి, ఉన్నంతలో అభినయం కూడా చేసి మెప్పించింది.
వైష్ణవ్ తేజ్ మాత్రం ఎప్పటికీ “ఉప్పెన” పేరే చెప్పుకుంటూ ఇలాంటి సినిమాల్ని చేస్తూ పోతే ఇక అతని కెరీర్ సైడ్ ట్రాకు పట్టి లూప్ లైన్లోని వెళ్లిపోవడం ఖాయం. ఈ సినిమాలో అతని ప్రతిభని కనబరిచే ఒక్క సన్నివేశం కూడా లేదు. ఇంతకంటే కొత్త నటులతో తీసే లో బడ్జెట్ సినిమాల్లోని హీరో క్యారెక్టర్లు బెటర్ గా ఉంటాయి. మనసుకి పట్టుకునే ఒక్క సన్నివేశం కూడా లేకుండా మరీ ఇంత పేలవంగా ఉండవు.
ప్రభు, నరేష్ లు ప్యాడింగ్ ఆర్టిష్టులకి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిష్టులకి తక్కువ అన్నట్టున్నారు. క్లైమాక్స్ లో కాసేపు తప్ప అసలు ప్రభుకైతే సినిమా మొత్తం మాటల్లేకుండా చేసారు. అలనాటి మేటి నటి శ్రీలక్ష్మి అయితే జూనియర్ ఆర్టిష్టులాగ ఉంది తప్ప అసలా క్యారెక్టర్ అవసరమే లేదు.
నవీన్ చంద్రకి మాత్రం కాస్త చెప్పుకోదగ్గ పాత్రే రాసారు. కానీ ఓవరాల్ గా చూస్తే అది కూడా పాత పద్ధతిలోనే ఉంది తప్ప కొత్తదనమేం లేదు. ఇలాంటి పాత్రలు అప్పట్లో శ్రీహరి పోషించేవాడు.
తులసి, ప్రగతి లు ఒకటి రెండు సీనుల్లో బానే ఉన్నారనిపించినా ఓవరాల్ గా పాతచింతకాయ పర్ఫామెర్మెన్స్ ఇచ్చారు.
సత్య కామెడీ రెండు దశాబ్దాల క్రితం నాటి సునీల్ కామెడీకి బ్యాడ్ ఇమిటేషన్ లా ఉంది. “అమ్మా చూడాలి..” పాట సీనైతే చిరాకుకి పరాకాష్టలా ఉంది.
సుబ్బరాజు పాత్రని మరీ ఆటలో అరటిపండుని చేసేసారు. ఆలిది అతిధి పాత్రలాంటి కొసరు పాత్ర. అది కూడా అరకొరగా రాసుకున్నారు. రాజారవీంద్ర క్యారెక్టర్ చీప్ గా ఉంది. ఎంత బూతు కాకపోయినా బూతుని ధ్వనిస్తూ అతను చెప్పే ఒకానొక డయలాగ్ అసహ్యం తెప్పిస్తుంది.
పవన్ కళ్యాణ్ సీనేదో వేసి మెప్పించాలనుకోవడం, హీరో చేత మాటిమాటికీ పాత చిరంజీవి పాటలు పలికించి అతను మెగా హీరో అని గుర్తు చేయడం లాంటివి పూర్ టేస్ట్ లో ఉన్నాయి.
మాస్ కామెడీ పేరుతో మెడికోస్ మీద స్మోకింగ్, డ్రింకింగ్ సీన్స్ పెట్టడం బాధ్యతారాహిత్యంగా ఉంది.
“కార్తీక దీపం” సీరియల్ నేపథ్యంలో కథ క్లైమాక్స్ కి చేరడం చూసాక ఈ సినిమా తీసినవారి ఐక్యూని చూసి “పాపం” అనాలనిపిస్తుంది.
తెర మీద కుటుంబకథలు రాకూడదా, వస్తే ఇలా విమర్శిస్తారా అని అడగొచ్చు. పైన చెప్పినట్టు తెర మీద అన్ని రకాల కథలూ రావొచ్చు. కానీ ఈ తరహా కథలు ఆల్రెడీ టీవీల్లో సీరియల్స్ రూపంలో వస్తున్నాయి. అలాంటి సీరియల్ కి లెంగ్త్ తగ్గించి సినిమాగా తీసేసి చూసేయమంటే అది ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేసినట్టే. అందుకే దీనిని టీవీలోనే చూస్తే ఏమో కానీ హాలుకొచ్చి చూస్తే మాత్రం నిరాశ తప్పదు.
బాటం లైన్: రంగ రంగా..!