ప్రతి జర్నలిస్టుకి వృత్తిలో కఠిన మైన రోజు ఒకటొస్తుంది. నాకు సెప్టెంబర్ 2, 2009లో వచ్చింది. ఆ రోజు వైఎస్ మరణించారు. ఆయన గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. మా వూరి అల్లుడు అని చెప్పుకునే వాళ్లు. తాడిపత్రి సమీపంలోని చీమలవాగుపల్లెలో విజయమ్మ చిన్నప్పుడు చదువుకున్నారు. ఆమె తండ్రి తర్వాత పులివెందుల వెళ్లిపోయారు.
1991 నుంచి 96 వరకూ కడప డెస్క్ ఇన్‌చార్జ్‌గా పని చేసాను. వైఎస్‌కి రాజకీయంగా క్లిష్టమైన రోజులు. ఆయన వార్తలు వస్తే ప్రముఖంగా వేసేవాన్ని. ఏదో ఒకటి కాకుండా, లాజికల్‌గా మాట్లాడే లక్షణం ఆయనది. తెలుగుదేశం అనుకూలత కొంత ఉన్నప్పటికీ, అప్పటి ఆంధ్రజ్యోతి మేనేజ్‌మెంట్ వైఎస్ వార్తలకి ఎందుకింత ఇంపార్టెన్స్ అని కానీ, తగ్గించమని కానీ ఒక్కరోజు కూడా చెప్పలేదు.
అదేం ఆకర్షణో కానీ, కడపకి ఆయన వస్తే రోడ్లన్నీ నిండిపోయేవి. రకరకాల పనుల కోసం వచ్చేవాళ్లు. లేదు అనే మాటే లేదు. ఏదో ఒకటి చేసేవాడు. పుట్టిన రోజు వస్తే, ఆయన కోసం తెచ్చిన గంపలకొద్ది పండ్లని ఆస్పత్రుల్లో రోగులకి పంపేవారు.
ఇగో లేకుండా ఎదుటి వాళ్లకి గౌరవం ఇచ్చి మాట్లాడే వ్యక్తిత్వం వల్ల ఆయన వెంట ఎపుడూ జనమే. చిరు నవ్వు, పలకరించే విధానం శాశ్వతంగా గుర్తుండిపోతాయి.
తిరుపతి ఎడిషన్ ఇన్‌చార్జ్‌గా సాక్షిలో చేరాను. 2009లో ఎన్నికలు. వైఎస్ మళ్లీ గెలిచారు. అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు ఎక్కడి నుంచో పిడుగు పడుతుంది. ఆ రోజు సెప్టెంబర్ 2.
చిత్తూరు జిల్లాలో రచ్చబండ. ముందు రోజే రిపోర్టర్లతో మీటింగ్. బ్యూరో ఇన్‌చార్జ్‌తో ప్లానింగ్. హెలీప్యాడ్ దగ్గర ఓ టీం, మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ ఇంటికి వస్తాడు కాబట్టి అక్కడో టీం, రచ్చబండ ప్లేస్‌లో ఓ టీం. కవరేజ్ ఏర్పాట్లన్నీ రెడీ.
ఉదయం 10కి కూడా బ్యూరో ఇన్‌చార్జ్ నుంచి ఫీడ్ బ్యాక్ లేదు. ఫోన్ చేస్తే సీఎం ఇంకా రాలేదు. 11 గంటలకి చేస్తే టెక్నికల్ ప్రాబ్లమ్ …లేట్ అవుతుందన్నారు. 12కు చేస్తే రచ్చబండ క్యాన్సల్. హెలీకాప్టర్ సాంకేతిక లోపంతో నల్లమల అడవుల్లో దిగిందన్నారు. ఏదో జరిగిందేమో అనే అనుమానం. ఏం జరగదనే నమ్మకం.
మధ్యాహ్నం దాటింది. చెన్నై నుంచి ఎయిర్‌ఫోర్స్ విమానాలు ఇంధనం కోసం రేణిగుంటలో ఆగాయి. భయం మొదలైంది. రోశయ్య ప్రెస్‌మీట్‌లో ఏదో జరిగిందని అర్థమైంది.
వైఎస్ రచ్చబండ ఫొటోలతో రావాల్సిన పేపర్, యాడబోయినావు రాజన్నా అని దిగులుగా వచ్చింది. జనంతో వైఎస్ మాట్లాడుతున్న ఫొటోలు వస్తాయనుకుంటే, ఆయన కోసం గుండెలు బాదుకుని దుఃఖిస్తున్న వాళ్ల ఫొటోలు వేయాల్సి వచ్చింది.
మరుసటి రోజు ఉదయం అంతా అయిపోయింది. ప్రజలతో గాఢంగా పెనవేసుకున్న వ్యక్తులు అరుదుగా పుడుతారు. వైఎస్ అరుదైన నాయకుడు.
జీఆర్ మహర్షి