దివంగత వైఎస్సార్ “ఆత్మ” కేవీపీ రామచంద్రరావు తన స్నేహితుడి జ్ఞాపకార్థం తన స్వగ్రామం కృష్ణా జిల్లా అంపాపురంలో దివంగత నేత కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆత్మీయుడిని కేవీపీ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని సన్నిహితులైన మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తన తల్లిదండ్రులను చూసేందుకు ఆయన అంపాపురం వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ ఏ లోకంలో ఉన్నా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు వైఎస్సార్‌తో అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు. సమాజానికి వైఎస్సార్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. తన ఆత్మగా చెప్పుకునే కేవీపీ స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి వైఎస్సార్ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా వుండగా కర్నాటకలో ఒకే కాలేజీలో కేవీపీ, వైఎస్సార్ వైద్య విద్యార్థులు. చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఎదిగారు. వైఎస్సార్‌కు వెన్నుదన్నుగా వుంటూ కేవీపీ ఎన్ఓనో విమర్శలను ఎదుర్కొన్నారు. స్నేహానికి రోల్ మోడల్‌గా కేవీపీ, వైఎస్సార్ నిలిచారు. వైఎస్సార్ మరణానంతరం కేవీపీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.