కర్ణాటకలో ప్రభుత్వం గురించి భారతీయ జనతా పార్టీ నేతలు రకకాల కామెంట్లు చేస్తూ వచ్చారు. లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కర్ణాటకలో ప్రభుత్వం నిమిషాల మీద కూలిపోతుందని వారు వ్యాఖ్యానించారు. అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగి ఇప్పటికే నెల గడిచిపోయినా కర్ణాటకలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది.
ఎన్నికల్లో వైరి పక్షాలుగా పోటీచేసి, ఫలితాల తర్వాత బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాంగ్రెస్, జేడీఎస్. అయితే ఇప్పటికీ వారికి ఉన్న మెజారిటీ అంతంత మాత్రమే. అయినప్పటికీ ఎలాగో బండి లాగిస్తున్నారు. అసంతృప్తులకు సర్ధిచెప్పడానికి ఇటీవలే కేబినెట్ విస్తరణ కూడా చేశారు. అయితే దాని వల్లా మరింతమంది అసంతృప్తులు తయారయ్యారు.
ఆ సంగతలా ఉంటే.. ప్రభుత్వాన్ని కూల్చామనే అపప్రద తమకు వద్దని ఇటీవల కమలనాథులు కటింగులు ఇస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని తాము కూల్చాల్సిన పనిలేదని, అదే కూలిపోతుందని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి పరిణామాలు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామాలు చేశారు. అయితే ఇంతటితోనే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. బొటాబోటీ మెజారిటీతో ప్రభుత్వం నిలబడుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే దానికి మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అవసరం.
అలాకాదంటే.. అంతేమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా.. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అదంతా సాధ్యమా అనేది ప్రశ్నార్థకం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపీకి ఒరిగేది ఉండకపోవచ్చు. ఆరునెలల్లో ఉప ఎన్నికలు ఎలాగూ తప్పవు. అప్పుడైనా మళ్లీ ఆ స్థానాలను కాంగ్రెస్సో, జేడీఎస్ గెలిస్తే.. అప్పుడు కథ మళ్లీ మొదటికి రావొచ్చు!