ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ గా కొనసాగుతూ దాదాపు పదేళ్లను పూర్తి చేసుకోబోతున్నారు నరసింహన్. రెండువేల తొమ్మిదిలో యూపీఏ హయాంలో గవర్నర్ గా నియమితం అయిన ఈ మాజీ పోలీసాఫీసర్.. పదేళ్లు గడిచిపోయినా, ప్రభుత్వాలకు ప్రభుత్వాలు మారిపోతున్నా, రాష్ట్ర విభజన జరిగినా అదే పోస్టులో కొనసాగుతూ ఉన్నారు! గవర్నర్ అంటే రెండు మూడేళ్లకూ, కాదంటే ఐదేళ్లకూ మారిపోతూ ఉంటారు అనుకుంటారు ఎవరైనా. అయితే వాటన్నింటికీ మినహాయింపులా కొనసాగిపోతూ ఉన్నారు నరసింహన్.
రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ, కేంద్రంతో కానీ ఎలాంటి వివాదాలకు పోకుండా నరసింహన్ చాకచక్యంగా సాగిపోతూ ఉన్నారు. అందుకే ఆయనకు కొనసాగింపు లభిస్తున్నట్టుగా ఉంది. అయితే నరసింహన్ స్థాన చలనం గురించి ఊహాగానాలు మళ్లీ చెలరేగుతూ ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కసరత్తు సాగిస్తూ ఉందని వార్తలు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకూ వేర్వేరు గవర్నర్ ల నియామకం జరగబోతూ ఉందని సమాచారం.
నరసింహన్ ను కచ్చితంగా మారుస్తారని, రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ఆయనకు అవకాశం దక్కపోవచ్చని కూడా వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వేర్వేరు గవర్నర్ లు రాబోతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నరసింహన్ కు మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వనుందట. ఆయనకు మరోచోట పోస్టింగ్ ఖాయమని.. ఆయనకు బహుశా జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల సలహాదారుగా అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వస్తుండటం గమనార్హం.