ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నగరాలను కాలుష్యరహిత నగరాలుగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేసినట్లు రాజ్యసభలో పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, దేశంలో కాలుష్యం బారిన పడిన నగరాలను కాలుష్యరహితంగా మార్చేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌కేప్)ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
2011-15 సంవత్సరాల మధ్య కాలంలో దేశంలోని వివిధ నగరాలలో వ్యాపించిన గాలి నాణ్యతకు సంబంధించిన డేటా ప్రాతిపదికపైన, ప్రపంచ బ్యాంక్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని 102 నగరాలు కాలుష్యం బారినపడినట్లుగా గుర్తించడం జరిగిందని అన్నారు. ఆ నగరాల జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు ఉన్నాయి. ఈ నగరాలలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన కార్యాచరణ పథకాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదించినట్లు మంత్రి చెప్పారు.
విశాఖపట్నం, విజయవాడ గుంటూరు, కర్నూలు, నెల్లూరుతో పాటు దేశంలోని 10 లక్షల జనాభా మించిన 28 నగరాలలో వాయు కాలుష్యాన్ని అరికట్టి పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఈ ఏడాది ప్రతి నగరానికి 10 కోట్ల రూపాయలను తమ మంత్రిత్వశాఖ మంజూరు చేసిందని తెలిపారు. కాలుష్యాన్ని అరికట్టే చర్యలను ఆయన వివరిస్తూ వాయు కాలుష్యంపై ప్రజలలో అవగాహనను పెంపొందించడం, యంత్ర పరికరాలను వినియోగించి వీధులను శుభ్రపరచడం, వాటర్ స్ప్రింక్లర్స్ వినియోగం, మొబైల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల ఏర్పాటు, వాతావరణంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ స్టేషన్ల ఏర్పాటు, పెద్దఎత్తున మొక్కల పెంపకం, పేవ్‌మెంట్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
ఐఎన్‌ఎస్ విరాట్ ఇక తుక్కే
భారత నౌకాదళం సేవల నుంచి విశ్రమించిన ప్రతిష్టాత్మక విమాన వాహక యుద్ధనౌకను తుక్కుగా మార్చాలని రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు ఆ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభలో ప్రకటించారు. వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2017లో భారత నౌకాదళం సేవల నుంచి ఉపసంహరించిన ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయబోవడం లేదని మంత్రి చెప్పారు.
ఈ యుద్ధనౌకను అప్పగిస్తే ఆర్థికంగా దానిని ఏ విధంగా భరించగలమో వివరించే ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రాలేదని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో భద్రత, రక్షణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత నౌకాదళంతో సంప్రదించిన మీదట ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఏ రాష్ట్రానికి అప్పగించకుండా తుక్కుగా మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.