బాబును భ‌య‌పెడుతున్న సెంటిమెంట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉంది. కానీ పొత్తు చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. మొట్ట మొద‌ట‌గా పొత్తు తుట్టెను చంద్ర‌బాబు క‌దిలించారు. అది కాస్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు స‌మ‌స్య‌ల్లా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉంది. కానీ పొత్తు చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. మొట్ట మొద‌ట‌గా పొత్తు తుట్టెను చంద్ర‌బాబు క‌దిలించారు. అది కాస్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు స‌మ‌స్య‌ల్లా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు వుంటుందా? లేదా? అనేదే. పొత్తుల‌పై వైసీపీ, బీజేపీ క్లారిటీతో ఉన్నాయి.

జ‌న‌సేన‌తో మాత్ర‌మే పొత్తు వుంటుంద‌ని బీజేపీ ప‌దేప‌దే స్ప‌ష్టం చేస్తోంది. సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని వైసీపీ దూకుడు మీద వుంది. ఇక జ‌న‌సేన‌, టీడీపీ ఎటూ తేల్చుకోలేక స‌త‌మ‌తం అవుతున్నాయి. ఈ రెండు పార్టీలు కోరుకుంటున్న‌ట్టు రాజ‌కీయాలు సాగ‌డం లేదు. అదే జ‌న‌సేన‌, టీడీపీకి మింగుడు ప‌డ‌లేదు.

మ‌రోవైపు పొత్తు లేక‌పోతే టీడీపీ అధికారంలోకి రాద‌నే సెంటిమెంట్ చంద్ర‌బాబును భ‌య‌పెడుతోంది. పొత్తులు లేక‌పోతే టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ల్లే అని గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తున్నారు. పొత్తు ఉన్నా అధికారంలోకి రాని వైనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇందుకు 2009 ఎన్నిక‌ల‌ను ఉద‌హ‌రిస్తున్నారు. 2014లో మాదిరిగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే త‌ప్ప జ‌గ‌న్‌ను ఓడించ‌లేర‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

ఈ వాద‌న‌ను ముఖ్యంగా జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే వాళ్లే తీసుకురావ‌డం విశేషం. పొత్తులుంటేనే జ‌గ‌న్‌ను ఓడించ‌డం క‌ష్టం…అలాంటిది లేక‌పోతే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ళ్లీ ఆయ‌నే సీఎం అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఏపీలో మూడు ప్రాంతాల వారీగా పొత్తుంటే ఎలా వుంటుంది? లేక పోతే ఫ‌లితాలు ఎలా? అనే అంశాల‌పై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ మూడు పార్టీల మ‌ధ్య పొత్తు ఉన్నా రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి పెద్ద న‌ష్టం ఉండ‌ద‌నేది అంద‌రి ఏకాభిప్రాయం. ఉత్త‌రాంధ్ర‌లో కూడా చెప్పుకోత‌గ్గ స్థాయిలో పొత్తు ప్ర‌భావం చూప‌ద‌ని అంటున్నారు. మ‌హా అయితే వైజాగ్‌లో కొద్దోగొప్పో ఫ‌లితాలు తారుమారు అవుతాయ‌ని అంటున్నారు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో మాత్రం కొంత వ‌ర‌కు వైసీపీ న‌ష్ట‌పోతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక కోస్తా జిల్లాల్లో కాపులు టీడీపీకి కొమ్ము కాయ‌ర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వంగ‌వీటి రంగా హ‌త్య‌ను కాపులు ఎప్ప‌టికీ మ‌రిచిపోర‌ని అంటున్నారు. 2014లో మూడు పార్టీలు క‌లిసినా కేవ‌లం రెండు శాతం లోపు ఓట్ల తేడాతోనే జ‌గ‌న్ ఓడిపోయార‌నే కీల‌క అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే చంద్ర‌బాబు భ‌యం కూడా అని అంటున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రి కూడా ప్ర‌తిప‌క్షాల‌ను దెబ్బ‌తీస్తోంద‌నే వాళ్లే ఎక్కువ‌.

ప‌వ‌న్ నిల‌క‌డ‌లేని రాజ‌కీయాల వ‌ల్ల‌, ఆయ‌న్ను న‌మ్ముకుని వెళితే భ‌విష్య‌త్ నాశ‌నం అవుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. దీంతో జ‌న‌సేన వైపు తొంగి చూసే వాళ్లే క‌రువ‌య్యారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాలు నేల‌విడిచి సాము చేసేలా ఉన్నాయి. రాజ‌కీయాల్లో ఇది ఎప్ప‌టికీ వ‌ర్కౌట్ కాద‌నేది ప‌లువురి అభిప్రాయం. పొత్తుల‌పై టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌ది ఒక‌డుగు ముందుకు, మూడు అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యారైంది. టీడీపీతో పొత్తుకు బీజేపీ స‌సేమిరా అంటోంది. దీంతో బీజేపీని కాద‌ని టీడీపీతో క‌లిసి వెళ్లేందుకు ప‌వ‌న్ త‌ట‌ప‌టాయిస్తున్నారు.

పొత్తుల‌పై ఆలోచించ‌డానికే టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు పుణ్య‌కాలం కాస్త మించిపోయేలా వుంది. ఇదే సంద‌ర్భంలో బీజేపీ ఛీత్కారం టీడీపీ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తోంది. ఈ నేప‌థ్యంలో పొత్తులు లేక‌పోతే జ‌గ‌న్‌ను ఎదుర్కోలేమో అన్న భ‌యం బాబును వెంటాడుతోంది. బాబు త‌న భ‌యాన్ని టీడీపీ శ్రేణుల‌పై కూడా రుద్దుతున్నారు. దీంతో టీడీపీ ఒంట‌రిగా జ‌గ‌న్‌ను ఎదుర్కోలేద‌న్న భావ‌న టీడీపీ శ్రేణుల్లో బ‌ల‌ప‌డుతోంది. పైగా సెంటిమెంట్ ఉండ‌నే ఉంది. అధికారానికి దారి ఎటు అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.