త్యాగమూర్తి చంద్రబాబు.. సిగ్గులేని మాటలు!

అవసరమైతే మళ్లీ బిజెపి చంక ఎక్కి కూర్చోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబునాయుడు తెగేసి చెప్పేశారు. పవన్ కల్యాణ్ తో తనకు వన్ సైడ్ లవ్ ఉన్నదంటూ.. సిగ్నల్ పంపి ఆయనను ఆకట్టుకున్న చంద్రబాబునాయుడు..…

అవసరమైతే మళ్లీ బిజెపి చంక ఎక్కి కూర్చోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబునాయుడు తెగేసి చెప్పేశారు. పవన్ కల్యాణ్ తో తనకు వన్ సైడ్ లవ్ ఉన్నదంటూ.. సిగ్నల్ పంపి ఆయనను ఆకట్టుకున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు బిజెపిని కూడా దువ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

ఎన్డీయేలో మళ్లీ తెలుగుదేశం పార్టీ చేరుతుందా అనే ప్రశ్నలకు సంబంధించి.. ఎటూ తేల్చకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను చేసిన పనులు అన్నీ త్యాగాలే అన్న కలరింగ్ తో తనను తాను త్యాగమూర్తి ధధీచిగా చాటుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండడమే పెద్ద కామెడీ!

దేశంలో మోడీ హవా ప్రబలంగా ఉన్నదనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో మోడీ జట్టులో ఎన్డీయేలో చేరి, పవన్ కల్యాణ్ దన్ను కూడా తీసుకుని చచ్చీ చెడీ గెలిచిన చంద్రబాబు.. చివరిదాకా కేంద్రప్రభుత్వంలో ఉన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం తప్ప.. రాష్ట్రం కోసం ఏమీ సాధించకుండా వంచనాపూర్వక రాజకీయం సాగించారు. 

తీరా.. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో.. ఎన్డీయే నుంచి  బయటకు వచ్చేసి.. అప్పటిదాకా రాష్ట్రం అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడానికి మొత్తం కారణం బిజెపి- కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని చాటడానికి సాహసించారు. బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని బూచిగా చూపించి.. తన చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు తెలివైన వాళ్లు కాబట్టి.. బిజెపి మీద సదభిప్రాయం లేకపోయినా.. బాబు బూటకపు మాటల్ని నమ్మకుండా ఓడించి ఇంటికి పరిమితం చేశారు. 

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరుతున్నదనే ప్రచారం ఒకటి జరుగుతోంది. రాష్ట్రం దురవస్థకు మోడీనే కారకుడు అని తీవ్రంగా నిందించిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్డీయేలో చేరగల అవకాశాలను కొట్టి పారేయడం లేదు. తాను ఎప్పుడూ రాష్ట్రప్రయోజనాలకోసమే పనిచేశానని, అందుకోసమే ఎన్డీయేనుంచి బయటకు వచ్చానని.. ప్రతిసారీ రాష్ట్రప్రయోజనాలకోణంలోనే నిర్ణయాలు తీసుకుంటానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు.. పరిపాలన మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం వలన పార్టీ చాలా నష్టపోయిందని ఆయన తనను తాను మభ్యపెట్టుకుంటున్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే ప్రయత్నంలో వ్యక్తిగతంగా కూడా చాలా నష్టపోయానని విలపిస్తున్నారు. ఇన్ని త్యాగాలు చేసి.. తన అయిదేళ్ల పదవీకాలంలో రాష్ట్రాన్ని ఆయన ఏం ఉద్ధరించారో.. ఏం ప్రగతిపథంలోకి తీసుకెళ్లారో.. ఆ భగవంతుడికే తెలియాలని జనం నవ్వుకుంటున్నారు. 

తన తెలుగుదేశం పార్టీ శిథిలావస్థకు  చేరుకున్న తర్వాత.. అదంతా తన చేతగానితనం కాదని, తాను పూర్తిగా రాష్ట్రం కోసం మనసుపెట్టడం వల్ల పార్టీ పతనమైందని ఆయన చెప్పడం చూసి.. మరీ ఇంత సిగ్గులేని మాటలా..? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.