వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన చెల్లి వైఎస్ షర్మిల ఇడుపులపాయలో పక్కపక్కనే కనిపించారు. వైఎస్సార్ 13వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ జగన్, భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, షర్మిల తదితర కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత నేతకు కుటుంబ సభ్యులంతా ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దివంగత వైఎస్సార్ సమాధి వద్ద జగన్, షర్మిల పక్కపక్కనే కూచోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్న వద్దన్నా తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె వైఎస్సార్టీపీ అధినేత్రి. తనయ షర్మిల కోసం తల్లి విజయమ్మ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తల్లి, చెల్లిని రోడ్డున పడేశాడని జగన్పై ప్రత్యర్థుల విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్తో షర్మిలకు తీవ్ర విభేదాలున్నాయని ప్రచారమవుతున్న నేపథ్యంలో ఇద్దరూ కలిసి తండ్రికి నివాళులర్పించడం గమనార్హం.
ఒక సందర్భంలో జగన్తో షర్మిల మాట్లాడుతూ కనిపించారు. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలున్నాయనే మాట నిజమే కానీ, మాట్లాడుకోనంతగా మాత్రం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తండ్రికి నివాళుర్పించే సందర్భంలో ఇద్దరూ పాల్గొనడాన్ని బట్టి ఇదే నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.