ఇవాళ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి. వైఎస్సార్ అంటే సంక్షేమానికి గుండెకాయ. తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించుకున్నారు.
జాతీయ స్థాయిలో యూపీఏ రెండోసారి అధికారంలోకి రావడానికి వైఎస్సారే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఊహించినన్ని ఎంపీ సీట్లను ఇచ్చిన నేతగా వైఎస్సార్‌ను జనం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.
అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకే ఆయన పేదల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి నాయకుడి ఆకస్మిక మృతితో ఏపీ పెద్ద దిక్కు కోల్పోయింది. ఇవాళ ఆయన వర్ధంతి. తండ్రిని స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అదేంటో చూద్దాం.
‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అని సీఎం ట్వీట్ చేశారు. వైఎస్సార్ అంటే సంక్షేమానికి ప్రతీకగానే చూస్తారు. అదే దృష్టితో జగన్ కూడా చూస్తున్నట్టు… ఆయన ట్వీట్ ప్రతిబింబిస్తోంది.