జగన్ Vs అనిల్.. ఏదో జరుగుతోంది?

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు మహూర్తం దగ్గర పడేకొద్దీ సీఎం జగన్ చూచాయగా కొన్ని ఇండికేషన్లు ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.  Advertisement ఇటీవల ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి రోజాను పక్కకు తప్పించడంతో పరోక్షంగా ఆమెకు కేబినెట్…

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు మహూర్తం దగ్గర పడేకొద్దీ సీఎం జగన్ చూచాయగా కొన్ని ఇండికేషన్లు ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి రోజాను పక్కకు తప్పించడంతో పరోక్షంగా ఆమెకు కేబినెట్ లో బెర్త్ ఖాయమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదవిపై కూడా కాస్త అనుమానాలు మొదలవుతున్నాయి.

పోలవరం సందర్శనలో మంత్రి అనిల్ ఎక్కడ..?

ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్నారంటే.. కచ్చితంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ ఆయన పక్కనే ఉంటారని అంతా అనుకుంటారు. ఉన్నారు కూడా, కానీ పరిమితంగానే. అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రి ప్రాధాన్యం అంతంతమాత్రంగానే ఉంది. 

ఆ తర్వాత ప్రాజెక్ట్ సందర్శనలో కూడా ఇతర మంత్రులు ముందుకొచ్చారే కానీ, అనిల్ వెనకబడిపోయారు. ఏరియల్ వ్యూ విషయంలో సీఎం జగన్, ఇతర అధికారులు మాత్రమే హెలికాప్టర్ ఎక్కారు. అనిల్ కి ప్లేస్ మిస్ అయింది. కేవలం హెలికాప్టర్ లోనేనా, లేక కేబినెట్ లో కూడానా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఏం జరుగుతోంది..?

మంత్రి పదవుల్లో యువతకు ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్.. వారి పనితీరుని కూడా మదింపు చేస్తూ వచ్చారు. కరోనా కష్టకాలంలో ఎవరు ఎలా పనిచేశారు, తమ శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. 

తాను ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, సీఎం జగన్ భక్తుడుని అని చెప్పుకుంటారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగన్ పై ఎవరు ఎక్కడ నోరెత్తినా వెంటనే ఆ నోటికి తాళం వేయడంలో ముందుకొస్తారు. జగన్ పై మాటపడకుండా కాచుకునే కోటరీలో అనిల్ కూడా ఒకరు. అయితే జలవనరుల శాఖ విషయానికొచ్చే సరికి ఎక్కడో తేడా కొట్టినట్టు అనుమానాలొస్తున్నాయి.

రెండు రాష్ట్రాల జలవివాదం సమయంలో కూడా తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారే కానీ, ఏపీలో సదరు శాఖ సరిగా స్పందించలేదనే అపవాదు ఉంది. అదే సమయంలో సజ్జల సహా ఇతర మంత్రులు, నేతలు తెలంగాణ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీలోని జలవనరుల శాఖ మాత్రం సరైన కౌంటర్ ఇవ్వలేకపోయింది. అన్ని వ్యవహారాలు సీఎం జగన్ పర్యవేక్షణలోనే జరగాలని ఉన్నా కూడా జలవనరుల శాఖ ప్రయత్నలోపం ఉందని అంటున్నారు.

జగన్ మనసులో ఏముందో చెప్పలేం. అలాగని ముందస్తుగా ఇచ్చే ఇలాంటి ఇండికేషన్లను కొట్టిపారేయలేం. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో మంత్రి అనిల్ కి ప్రయారిటీ లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనలో ఉంది.