తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపొందాలని టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా టీఆర్ఎస్ వదిలి పెట్టుకోడానికి సిద్ధంగా లేదు. తాజాగా టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఇటీవల సీపీఐ కూడా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుగోడు సభలో కేసీఆర్‌తో పాటు సీపీఐ నేతలు పాల్గొన్నారు కూడా.
అయితే సీపీఎం మద్దతు నేపథ్యంలో నెటిజన్లు ఆ పార్టీపై ట్రోలింగ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు నుంచి బయటపడడానికి మార్క్సిజాన్ని బలిపెడుతున్నారా? అంటే తమ్మినేని వీరభద్రాన్ని, ఆ పార్టీ ముఖ్య నేతలను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య ఇటీవల హత్యకు గురయ్యారు. ఈయన హత్య కేసులో ప్రధానంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాత్ర ఉందని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
హత్య కేసులో తమ్మినేని వీరభద్రం సొంత తమ్ముడు కూడా నిందితుడు. హత్యపై మృతుడు కృష్ణయ్య కుమారుడు నవీన్, కుమార్తె రజిత ఏమన్నారో వారి మాటల్లోనే… ‘మా తండ్రి హత్యకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే ప్రధాన సూత్రధారి. వీరభద్రం ఆదేశాలతోనే ఆయన తమ్ముడు తమ్మినేని కోటేశ్వరరావు మా తండ్రిని హత్య చేయించాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన మా కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వకుండా తమ్మినేని వీరభద్రానికి భద్రత కల్పించడమేంటి? నిందితులను పట్టుకునే విషయంలో స్థానిక పోలీసులు సరిగా పని చేయడం లేదు’ అని ఇటీవల ఘాటు ఆరోపణలు చేశారు.
మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించే నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘మునుగోడులో సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయి. బీజేపీని ఓడగొట్టడానికి టీఆర్ఎస్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా ఉండబోతోంది. దీన్ని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మార్చబోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా మూడో స్థానానికి పోతుంది. మునుగోడు విషయంలో సీపీఎం లైన్‌కు, సీపీఐ లైన్‌కు కొంత తేడా ఉంది. టీఆర్ఎస్కు మా మద్దతు మునుగోడు వరకే. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కలిసిపోదామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. కృష్ణయ్య హత్య విషయానికి మునుగోడులో టీఆర్ఎస్ మద్దతుకు సంబంధం లేదు. మునుగోడు ఉప ఎన్నిక ల్లో మద్దతు కోసం కేసీఆర్ మమ్మల్ని వాడుకోవడం లేదు. మేమే కేసీఆర్ ను వాడుకుంటున్నాం. బీజేపీతో కేసీఆర్ ఒకరోజు మిత్రునిగా, ఒకరోజు శత్రువుగా ఉంటారు’ అని తమ్మినేని అన్నారు.
బీజేపీతో కేసీఆర్ ఒక రోజు మిత్రునిగా, మరోసారి శత్రువుగా వుంటారని చెబుతూనే, టీఆర్ఎస్కు ఏ విధంగా మద్దతు ప్రకటించారని నెటిజన్లు తమ్మినేని వీరభద్రాన్ని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్‌ను తామే వాడుకుంటున్నామని తమ్మినేని సరిగ్గా చెప్పారని, అది ఏ విధంగానో తెలియాలంటే కృష్ణయ్య హత్య కేసు విచారణే చెబుతోందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై పోరాడాలని కాంగ్రెస్ కూడా పిలుపునిస్తోందని, మరి ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వలేదని సోషల్ మీడియాలో నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి తనతో పాటు తన వాళ్లు హత్య కేసు నుంచి బయటపడడమే ఏకైక ఎజెండా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది నిజం కాకపోతే సొంత పార్టీకి చెందిన నాయకుడు హత్యకు గురైతే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరభద్రానికి కేసీఆర్ ప్రభుత్వం రక్షణ కల్పించడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.