ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించడానికి రీమేక్ అవ‌స‌ర‌మా నార‌ప్పా?

సీన్ టు సీన్ కాదు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. కార్బ‌న్ కాపీ అన‌డానికి ఇంత‌క‌న్నా వేరే ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం ఉండ‌దు. ఆఖ‌రుకు డైలాగులు కూడా అనువాద‌మే! రాయ‌ల‌సీమకు ఈ సినిమా నేప‌థ్యాన్ని అయితే…

సీన్ టు సీన్ కాదు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. కార్బ‌న్ కాపీ అన‌డానికి ఇంత‌క‌న్నా వేరే ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం ఉండ‌దు. ఆఖ‌రుకు డైలాగులు కూడా అనువాద‌మే! రాయ‌ల‌సీమకు ఈ సినిమా నేప‌థ్యాన్ని అయితే అతికించారు కానీ, సీమ స్లాంగ్ పేరుతో ఏదేదో రాసేశారు. రాయ‌ల‌సీమ యాస‌ మ‌చ్చుకైనా ఉప‌యోగించ‌ని మాట‌ల‌ను డైలాగులుగా మార్చారు. అవ‌న్నీ త‌మిళ అసుర‌న్ సినిమా డైలాగుల‌కు య‌థాత‌థ అనువాద‌మ‌ని రెండు వెర్ష‌న్ల‌ను చూసిన వారికి అర్థం అవుతూ ఉంది. మ‌రింత విడ్డూరం ఏమిటంటే.. వివిధ సీన్ల‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా త‌మిళం నుంచి తెచ్చుకుని యాజిటీజ్ గా వాడేసుకోవ‌డం నార‌ప్ప‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌త‌!

మ‌రీ ఇంత‌లా దించేయ‌డానికి.. కార్బ‌న్ కాపీ కొట్ట‌డానికి.. రీమేక్ ఎందుకు? అనేది ఇక్క‌డ ప్ర‌శ్న‌!  ఈ సినిమా రూప‌క‌ర్త‌లు అర్థం చేసుకోవాల్సి ఉండిన మ‌రో విష‌యం ఏమిటంటే.. జ‌నాలంతా లాక్ డౌన్ లో ఉన్నారు. ఇళ్లు దాట‌డం క‌ష్ట‌మైన ప‌నిగా ఉంది. ఆఫీసులు, థియేట‌ర్లు బంద్. దీంతో ఓటీటీల మీద ప‌డ్డారు. అక్క‌డ బెస్ట్ సినిమాల‌ను ఎంచుకుని చూసేస్తూ ఉన్నారు. అలా తెలుగు వారి మ‌ధ్య‌న బాగా వీక్ష‌కాద‌ర‌ణ పొందిన సినిమాల్లో ఒక‌టి త‌మిళ అసుర‌న్. ఆ సినిమాను రీమేక్ చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా య‌థాత‌థంగా అనువ‌దించ‌డం వ‌ల్ల‌.. ఈ తెలుగు వెర్ష‌న్ చూసిన వాళ్లు విస్తుపోతున్నారు. కంటెంట్ కు ఇప్పుడు బౌండ‌రీలు లేవు. రీమేక్ అనేదే ఈ ప‌రిస్థితుల్లో ఒక సెన్స్ లేని అంశం! మ‌రి రీమేకే అర్థం లేని చ‌ర్య అయిన‌ప్పుడు.. య‌థాత‌థ రీమేక్ అనేది ప్ర‌హ‌స‌నంగా మారుతుంది. నార‌ప్ప అచ్చం అలాంటి ప్ర‌హ‌స‌న‌మే!

అమెజాన్లో ఒక సినిమాను వివిధ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు ఈ మ‌ధ్య‌. ఒకే సినిమా వివిధ భాష‌ల్లో అందుబాటులో ఉంటోంది. ఇలాంటి నేప‌థ్యంలో .. ఇప్పుడు ఈ రీమేక్ వెర్ష‌న్ కాస్తా, డ‌బ్బింగ్ వెర్ష‌న్ లా మారింది. అయినా.. ఈ రీమేక్ ను ఒరిజిన‌ల్ తో పోల్చ‌డం దుస్సాహ‌స‌మే!

త‌మిళ వెర్ష‌న్ లో ఉన్న ఆత్మ తెలుగు వెర్ష‌న్ లో మిస్ అయ్యింది. చాలా రీమేక్ ల విష‌యంలో ఇలాంటి మాటే వినిపిస్తూ ఉంటుంది. క‌ల్ట్ హిట్ అయిన సినిమాలు, ఒక భాష‌లో విప‌రీత ఆద‌ర‌ణ పొందిన సినిమాల‌ను రీమేక్ చేసిన‌ప్పుడు.. ఒరిజిన‌ల్ ను చూసిన క‌ళ్లు రీమేక్ వెర్ష‌న్ ను చూడ‌టానికే స‌యించ‌వు! ఇది కొత్తేం కాదు. ఇప్పుడు అసుర‌న్ రీమేక్ కు కూడా అదే వ‌ర్తిస్తుంది. అసుర‌న్ ను చూసిన వాళ్లకు ఇదో పేర‌డీ అనిపించ‌వ‌చ్చు. కాబ‌ట్టి.. అసుర‌న్ ను చూసి న‌చ్చింద‌నుకున్న వాళ్లు అటు వైపు ఉండిపోవ‌డ‌మే మంచిది.

ఈ సినిమాను రాయ‌ల‌సీమ‌కు అయితే అతికించారు కానీ, అది కూడా అతుకుల బొంత‌లానే ఉంది. ఇలాంటి సినిమాల‌ను రూపొందిస్తున్న‌ప్పుడు మాండ‌లికం కూడా చాలా కీ రోల్. అయితే ఆ సౌండింగ్ మ‌చ్చుకైనా లేదు. క‌నీసం మాట‌ల విష‌యంలో కూడా శ్ర‌ద్ద చూపించ‌లేదంటే.. రీమేక్ వెర్ష‌న్ మీద చేసిన క‌స‌ర‌త్తు ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సినిమాను రీమేక్ చేస్తానంటూ త‌నే సురేష్ బాబును క‌లిసిన‌ట్టుగా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పారు, మ‌రి వీస‌వెత్తు మార్పు చేయ‌క‌పోవ‌డ‌మే .. అసుర‌న్ తెలుగు వెర్ష‌న్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి అర్హ‌త కాబోలు అని ప్రేక్ష‌కుడు ఇప్పుడు అనుకోవాల్సి వ‌స్తోంది!

చెప్పుకోద‌గిన‌ది న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న మాత్ర‌మే. వెంక‌టేష్ వంటి సీనియ‌ర్ కు ఇలాంటి పాత్ర‌లు క‌ష్టం కాదు. ప్రియ‌మ‌ణి, ఇత‌ర తారాగ‌ణం కూడా అంతా స‌త్తా ఉన్న వాళ్ల‌నే తీసుకున్నారు.  దీంతో ఆ విష‌యంలో మాత్రం నార‌ప్ప పేరు పెట్ట‌డానికి వీల్లేన‌ట్టుగా ఉంది. వాళ్ల న‌ట‌న‌కు తోడు క‌నీసం మాట‌ల మీద అయినా దృష్టి పెట్టిన‌ట్టు ఉంటే.. ఏదో ఒక కొత్త  వెర్ష‌న్ ను చూస్తున్న అనుభూతి అయినా మిగిలేది. కానీ క‌నీసం ఒక రీమేక్ విష‌యంలో ప్రాథ‌మిక అంశాల మీద కూడా క‌స‌ర‌త్తు చేయ‌కుండా, య‌థాత‌థంగా రీమేక్ చేయ‌డానికి పూనుకున్నారు. అదే స‌మ‌యంలో ఒరిజిన‌ల్ లో ఉన్నంత ఇంటెన్సిటీ కూడా మిస్ అయ్యింది. దీంతో.. అసుర‌న్ రీమేక్ నార‌ప్ప అటూ ఇటూ కాకుండా పోయింది. అయితే ఈ సినిమాకు క‌లెక్ష‌న్లు ప్ర‌త్యేకంగా రావాల్సిన అవ‌స‌రం లేదు కాబ‌ట్టి… హిట్టా, ఫ్లాపా అనేది కూడా ప్రామాణికం కాకుండా పోతోంది!