విక్టరీ వెంకటేశ్ అభిమానులకు ‘నారప్ప’ నిర్మాత కలైపులై థాను క్షమాపణ చెప్పారు. ఇందుకు కారణం తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడమే. తాజాగా ఓటీటీలో ‘నారప్ప’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలో సినిమా విడుదల చేస్తున్నందుకు క్షమించాలని ఇప్పటికే హీరో వెంకటేశ్ అభిమానుల్ని కోరారు.
తమిళం సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా ‘నారప్ప’ను తెరకెక్కించారు. రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటించారు. ఓటీటీలో సినిమా విడుదలపై నిర్మాత కలైపులై థాను స్పందన వైరల్ అవుతోంది.
‘దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెంకటేశ్ తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు. ‘నారప్ప’లో ఆయన అద్భుతంగా నటించారు. థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంపై చాలామంది అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని నేనూ ఒప్పుకొంటున్నా. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని సురేష్‌బాబు అనుకున్నారు.
మే 14న సినిమా విడుదల చేస్తామని మొదట ప్రకటించాం. కరోనా సెకండ్ వేవ్ వల్ల అది కుదరలేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ భయం పొంచి ఉండడంతో ఎలాగోలా సినిమాను విడుదల చేయాలని సురేశ్‌బాబును నేను ఒప్పించాల్సి వచ్చింది. అభిమానులను క్షమాపణలు కోరుతున్నా’ అని థాను చెప్పుకొచ్చారు.