మోడీ సర్కార్‌పై ఏపీ అధికార పార్టీ వైసీపీలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మార్పు మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నిన్న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్ష, విభజన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం, అలాగే జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడం, తదితర అంశాలపై పార్లమెంట్ వేదికగా నిలదీస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అఖిలపక్షం సమావేశం అనంతరం కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తడం కాస్తంత ఆశ్చర్యం కలిగించింది. అయితే నేడు లోక్‌సభ, రాజ్యసభలలో వైసీపీ వ్యవహార శైలి చూసి మిగిలిన పార్టీలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నంత పనైంది. కేంద్రం అంటే భయభక్తులతో నడుచుకునే వైసీపీలో ఒక్కసారిగా ఈ మార్పు ఏంటనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఏపీ సమస్యలపై కేంద్రాన్ని వైసీపీ ఎంపీలు గట్టిగా నిలదీశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టారు. పోలవరంపై లోక్‌సభలో చర్చకు వైసీపీ ఎంపీలు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి తీవ్ర నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి, మిథున్ రెడ్డి .. పోలవరం ప్రాజెక్ట్ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలోనూ వైసీపీ ఎంపీలు కేంద్రం వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ఎంపీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు వైసీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అసలే పరోక్ష మిత్రపక్షంగా ఉన్న వైసీపీ కూడా కేంద్రానికి రివర్స్ అయినట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీతో అంటకాగడం వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలేవీ కనిపించకపోవడంతో వైసీపీ స్వరం మార్చిందని చెబుతున్నారు. వైసీపీ ఇదే వైఖరితో ఉంటే మాత్రం రాజ్యసభలో బిల్లులను మోడీ సర్కార్ గట్టెక్కించుకోవడం కష్టమే అని అంటున్నారు.