టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన దారి తాను చూసుకోవడంతో కొత్త రథసారథిని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా బక్కని నర్సింహులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈయన పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. 1994-99 మధ్య కాలంలో షాద్‌నగర్ ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది.
తెలంగాణలో టీడీపీ రోజురోజుకూ కనుమరగవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్.రమణ ఇటీవల టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డిని అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబు కోరినా… ఆయన ససేమిరా అన్నారు. ఆ తర్వాత టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, బీసీ సామాజికవర్గ నేత అరవింద్‌గౌడ్ పేరు తెరపైకి వచ్చింది.
పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఆయన కూడా ముందుకు రాలేదు. దీంతో చివరికి ఎవరికీ పెద్దగా తెలియని బక్కని నర్సింహు లకు అధ్యక్ష బాధ్యతలను చంద్రబాబు కట్టబెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సమస్యలపై పోరాడాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు.